వేదన్యూస్ -గాంధీభవన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో మనం కళ్లారా చూశాము. రాష్ట్రాలను దేశాలను దాటి ప్రపంచాన్ని సైతం చుట్టి వచ్చింది. అంతగా యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు వారం రోజులకు పైగా కోట్లాడారు.
ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. ఎంతోమంది జైళ్లకు వెళ్లారు. అఖరికీ దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు జోక్యం కల్పించుకోవడంతో తాత్కాలికంగా ఈ వివాదం సర్దుమణిగినట్లు ఉంది. అయితే నిప్పుపై పెట్రోల్ పోసినట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షుడైన డా. మల్లు రవి వ్యాఖ్యానించారు.
గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ హెచ్ సీయూ యూనివర్సిటీని ఫోర్త్ సిటీకి తరలిస్తాము. అక్కడ యూనివర్సిటీని అభివృద్ధి చేసి తీరుతాము. కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలతో పాటు యూనివర్సిటీ పరిధిలోని పదిహేను వందల ఎకరాలను కలిపి మొత్తంగా రెండు వేల ఎకరాలను ఏకో పార్కుగా అభివృద్ధి చేసి తీరుతాము అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
