వేద న్యూస్, సినిమా:
దర్శకులు వెండితెర మీద చరిత్రకు ప్రాణం పోస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టులను రూపొందిస్తూ.. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయిలో పేరు సంపాదించగా, ఆ పేరును నిలబెట్టే ప్రయత్నానికి డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు దర్శకులు చారిత్రక నేపథ్యమున్న వారి కథలను వెండితెరపై ఆవిష్కరించారు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పేరిట డైరెక్టర్ క్రిష్.. నందమూరి బాలకృష్ణతో చిత్రం తీయగా, అది బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఇక అదే దర్శకుడు 20 వ శతాబ్దపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీరమల్లు’ను తెరకెక్కించారు. అయితే, సదరు దర్శకుడు ప్రస్తుతం ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోగా, జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో ఏఎం రత్నం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడగా, ఫిల్మ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. చారిత్రక నేపథ్యమున్న నాగేశ్వరరావునేపథ్యాన్ని ‘టైగర్ నాగేశ్వర్ రావు’గా రవితేజతో సినిమా రాగా, అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా 7వ శతాబ్దం నాటి యోధుడి కథను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు సంకల్ప్ వెల్లడించారు. ఇందులో హీరోగా మ్యాచో మ్యాన్ గోపీచంద్ నటించనున్నారు.

చరిత్రను తవ్వి అందులోని హీరోయిక్ పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం ద్వారా నేటి తరానికి ఆ‘నాటి’ యోధులు పరిచయమవుతారనేది సత్యమే. ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ జీవితగాథను ‘సైరా నరసింహారెడ్డి’గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ఈ తరహాలో(చరిత్రకు సంబంధించి) మరి కొన్ని సినిమాలు రావాలని సినీ అభిమానులు అయితే ఆకాంక్షిస్తున్నారు.