•  తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై నియోజకవర్గ ముద్ర
  •  కాన్‌స్టిటుయెన్సీ నుంచి ఎదిగివచ్చిన నాయకులకు చక్కటి అవకాశాలు
  •  ప్రధాన రాజకీయ పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్న హుజురాబాద్ లీడర్లు
  •  తమ ప్రాంత నాయకులకు కీలక అవకాశాలు వస్తుండటం పట్ల జనం సంతోషం

వేద న్యూస్, కరీంనగర్:

తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో హుజురాబాద్ నియోజకవర్గానికి ‘ప్రత్యేక’ స్థానం సుస్థిరంగా కొనసాగుతోందని చెప్పొచ్చు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉండగా, ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించే నాయకులకు మాత్రం అవకాశాలు ప్రముఖంగా వస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ హుజురాబాద్ నియోజకవర్గ నుంచి ఎదిగి వచ్చే రాజకీయ నాయకులకూ చక్కటి అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ అధినాయకత్వం దృష్టిలో పడటమే కాదు..కీలకంగా వ్యవహరిస్తుంటున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, తమ ప్రాంత నాయకులకు ప్రాధాన్యత అంతటా, అన్ని పార్టీల్లో లభిస్తుండటం పట్ల జనం సంతోష పడుతున్నారు.

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆ‘నాటి’ ఉద్యమ నేత, నేటి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ కు తమ్ముడిగా, కుడి భుజంగా పేర్కొనబడే ఈటల రాజేందర్..రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ ఓనమాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి ఆయన ‘నాయకుడు’ అనే అభిప్రాయాన్ని జనం గుండెల్లో స్థానాన్ని పొందగలిగారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీ నుంచి ‘కమలం’ గూటికి వెళ్లినా ప్రజలు ఆదరించారు. ఆయనకు విజయం అందించారు. 20 ఏండ్ల పాటు హుజురాబాద్ జనంతో ఉన్న ఈటల రాజేందర్..ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. అయితేనేం..నెలల వ్యవధిలో మరోసారి కీలకంగా మారారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఆ స్థాన లోక్ సభ సభ్యుడిగా ఉన్న ‘మల్కాజ్ గిరి’ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలవబోతున్నారు.

తాజాగా బీజేపీ విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో రాజేందర్ ఈటల..పేరు ఉండటంతో రాజకీయంగా మరో మారు ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో యుద్ధానికి దిగబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం ఒక వైపు తమ నేత తమతో ఉన్న ‘పేగు బంధాన్ని’ తెంపుకుంటున్నారేమో అని అనుకుంటూనే..మరో వైపున తమ బిడ్డ..మల్కాజ్ గిరి నుంచి గెలిచి ఢిల్లీలోనూ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.

హుజురాబాద్ నియోజకర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం శాసన సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తోన్న పాడి కౌశిక్ రెడ్డి..సైతం రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం తక్కువ వయసులోనే పొందారు. బలమైన నాయకుడిగా పేరొందిన ఈటల రాజేందర్ ను ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారు. పాడి కౌశిక్ రెడ్డికి గులాబీ పార్టీ అధినాయకత్వంతో సత్సంబంధాలు ఉండటం విశేషం.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా ప్రతిపాదించగా..అది ఆమోదం పొందకపోయినా..మరోసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి..అప్పటి పింక్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ శాసన మండలి విప్ గా అవకాశమిచ్చింది. ఇక ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అంతకు మునుపు కాంగ్రెస్ పార్టీ లోనూ అప్పటి పీసీసీ అధ్యక్షులు, అధిష్టానం కూడా ఈ నాయకుడి కి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి వస్తే..పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పదవి సైతం వస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, గులాబీ పార్టీ రాష్ట్రస్థాయిలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థి నాయకుడు..గెల్లు శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రస్థాయిలో విద్యార్థి విభాగానికి రాష్ట్రస్థాయిలో అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

ఇక హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహించే నాయకులకు సైతం అధిష్టానంతో చక్కటి సంబంధాలు ఉండటం విశేషం. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో హస్తం పార్టీ తరఫున పోటీ చేసిన బల్మూరి వెంకట్ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులుగా కీలక పాత్ర పోషించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను ఎమ్మెల్సీ చేసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిన..బల్మూరి వెంకట్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనుములకు అత్యంగా సన్నిహితుడిగా ఉండటం విశేషం.

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న ప్రణవ్ వొడితలకు కూడా త్వరలో ఆర్టీసీ చైర్మన్ లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించబోతున్నదనే ఊహాగానాలు వినబడుతున్నాయి. మొత్తంగా ప్రధాన రాజకీయ పార్టీల తరఫున హుజురాబాద్ నియోజకవర్గ నుంచి ప్రాతినిథ్యం వహించే నాయకులకూ ఆయా పార్టీల్లో సముచిత స్థానం రాష్ట్ర స్థాయిలో లభిస్తుండటం మంచిదేనని ప్రజలు అంటున్నారు. తద్వారా తమ ప్రాంత అభివృద్ధికి వారు మరింత తోడ్పాటు అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొంటున్నారు.