•   డాక్టర్ ఊడుగుల సురేశ్ ముఖ్యమమైన సూచనలు

వేద న్యూస్, జమ్మికుంట:
మలబద్ధకం(కాన్‌స్టిపేషన్) అనేది మలవిసర్జన ఆలస్యం కావడం లేదా అసంపూర్ణంగా రావడం వంటి లక్షణాలతో కనిపించే సమస్య. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే పైల్స్, ఫిషర్లు వంటి అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

ఈ నెల(డిసెంబర్) 1 నుంచి 31 వరకు మలబద్ధకంపై అవగాహన కల్పించే నెల కావడంతో.. ప్రజలకు మలబద్ధకం నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన పేగు అలవాట్లు, సమయానికి సరైన చికిత్స గురించి ప్రముఖ వైద్యుడు, గోల్డ్ మెడలిస్ట్, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. ఆ ముఖ్యమైన సూచనలు మీ కోసం..

ఈ అలవాట్లు అనుసరించండి
మలబద్ధకం నివారణకు ప్రతీ రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని, ఆహారంలో ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు (గోధుమ రొట్టె, పప్పులు, కూరగాయలు, పండ్లు) ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్ సురేశ్ చెప్పారు. టీ, కాఫీ, జంక్-ఫుడ్ తగ్గించాలని, నిత్యం నడక, వ్యాయామం చేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు.

టాయిలెట్ ఆపకుండా సమయానికి వెళ్లడం,లూస్ దుస్తులు, ఒత్తిడి లేకుండా ఉండే జీవనశైలి కలిగి ఉండాలన్నారు. 2–3 రోజుల్లో మల విసర్జన లేకపోవడం, మలం గట్టిగా, రాళ్లలాగా బయటకు రావడం, విసర్జన సమయంలో ఒత్తిడి పెట్టాల్సి రావడం,కడుపు నిండినట్టు, బరువుగా అనిపించడం, తినిన తర్వాత ఫూలింగ్, గాలి ఎక్కువగా రావడం, చిన్నపాటి రక్తస్రావం వంటివి చీలిక (ఫిషర్) లక్షణాలు అని, ఇవి ముందస్తుగా మలబద్ధకం సమస్యగా గుర్తించాలని సూచించారు. ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

ఇవి ఆరోగ్యకరమైన పేగు అలవాట్లు
ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ వెచ్చని నీరు తాగాలని, ప్రతీ రోజూ ఫైబర్ 25 నుంచి 30 గ్రాములు తీసుకునే అలవాటు చేసుకోవాలని డాక్టర్ సురేశ్ వెల్లడించారు.

పప్పులు, పండ్లు (పపయ, సీతాఫలం, అరటి), ఓట్స్, మొలకలు తీసుకోవాలన్నారు. ఉదయం రొటీన్ ఫిక్స్ చేసుకోవడం (టాయిలెట్ టైమ్) మంచిదన్నారు. ఎక్కువసేపు ఫోన్, పుస్తకం పట్టుకొని టాయిలెట్‌లో కూర్చోకూడదని, అవసరమైతే డాక్టర్ సూచనతో స్టూల్ సాఫ్ట్‌నర్ / లాక్సేటివ్ వాడాలని చెప్పారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలని చెప్పారు.