- రాయడానికి మేము..చదవడానికి మీరు..సిగ్గు పడాల్సిందే
వేద న్యూస్, కృష్ణ:
ఒకరేమో రండా అంటారు… ఒకరేమో బట్టేబాజ్ అంటారు.. మరొకరేమో నీ అంతు చూస్తా అంటారు..ఇంకొకరేమో చెప్పుతో కొడతా ఉంటారు.. గల్లీ లీడర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతీ ఒక్కరి నోట బూతు పురాణం వినబడుతోంది. ఈ రాజకీయ నాయకులు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదు..అసలు రాజకీయాలంటే చట్టసభలకు దారి చూపించే మార్గాలు.
రాజకీయ నేతలంటే లక్షలాది మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ, తెలంగాణ రాజకీయాలు మాత్రం రోజురోజుకూ దిగజారి పోతున్నాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విధానపరమైన అంశాల విషయంలో విభేదించడమో.. విమర్శించడమో చేసేవి. అది కూడా ఎంతో హుందాతో కూడుకున్న భాష వాడేవారు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు వ్యక్తిగత విమర్శలకే పెద్దపీట వేస్తు రెచ్చిపోతున్నారు.
కొంత మంది నాయకులు మాత్రం తమ స్థాయి మరచి దిగజారి మరీ పరుషమైన పదజాలంతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారనేది వాస్తవం. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు చూస్తున్నారు అనే సోయి కూడా లేకుండా కొందరు నాయకులు సోషల్ మీడియా వేదికగా కాకుండా మైకు దొరికిందే అదునుగా ఇష్టం వచ్చిన రీతిలో వాగేస్తూ రోజురోజుకూ దిగజారి పోతున్నారు.
గతంలో అసెంబ్లీలో అవతలి పార్టీ వారిని విమర్శించాలన్నా గౌరవనీయులైన ఫలానా వారు అంటూ సంభోధించే వారు. ఇప్పుడు కొందరి రాజకీయ నాయకులు నోరు తెరిస్తే అరేయ్, ఒరేయ్, ఏరా, పోరా.. లాఫుట్, రండ, దద్దమ్మ, లాంటివే కాకుండా కొన్ని బూతు పదాలు ఈజీగా వాడేస్తున్నారు. అరవడానికి వారికి సిగ్గులేక పోయినా రాయడానికి మేము..చదవడానికి మీరు..సిగ్గు పడే పదాలు కూడా వాడిన సందర్భాలు అనేకం.. ఇప్పటికైనా రాజకీయ నాయకులు తమ పద్ధతిని మార్చుకొని హుందాతనంగా విమర్శించాలని పలువురు కోరుతున్నారు.