- తహశీల్ ఆఫీసులో జనం సమస్యలపై పట్టింపేది?
- తమ గోడు పట్టించుకోవడం లేదని మండలవాసుల ఆవేదన
- సామాన్యులకు దూరంగా కార్యాలయం మారిందని ఆరోపణలు
వేద న్యూస్, బెజ్జంకి:
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తహశీల్దారు కార్యాలయంలో పైరవీకారులు రాజ్యమేలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వివిధ రకాల అవసరాల నిమిత్తం తహశీల్ ఆఫీసుకు వచ్చే రైతులను, సామాన్య ప్రజలను పట్టించుకునే వారు ఆఫీసులో కరువయ్యారని, తహశీల్దారును కలిసే క్రమంలో అసలు అటెండర్ పాత్ర లేదా.. ఆయన ఎక్కడ? అని వివిధ గ్రామాల రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.తహశీల్దారు కోసం ఆఫీసుకు వస్తే పడిగడుపులు కాయాల్సిందేనని తమను లోపలికి పంపే నాథుడే కరువయ్యారని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇదే క్రమంలో సామాన్యులు, రైతుల విషయంలో తహశీల్ ఆఫీసులో ఇలా వ్యవహార సరళి ఉంటే..పేరు, పలుకుబడి ఉన్న పైరవీకారులు మాత్రం సరాసరి ఎవరి అనుమతి లేకుండా నేరుగా ఎమ్మార్వో కార్యాలయంలోకి వెళ్లి, తమ పనులను చేసుకొని దర్జాగా బయటికి వస్తున్నారు. పనుల నిమిత్తం వచ్చిన తమకు మాత్రం పడిగాడుపులే మిగులుతున్నాయని రైతులు, సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తహశీల్దారు ఆఫీసులో అడ్మినిస్ట్రేషన్ ఉందా? లేదా? అని అడుగుతున్నారు.
తహశీల్దారు కార్యాలయంలో రైతులు, సామాన్యులను ఒక‘లా’, పైరవీకారులను మరో‘లా’ చూస్తూ, ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం పట్ల సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి తహశీల్ ఆఫీసులో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
తహశీల్దారు సైతం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని, వారితో మాట్లాడాలని జనం అంటున్నారు. తహశీల్ ఆఫీసులో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ శాఖ ఉద్యోగులపై తగు చర్యలు తీసుకొని, ఆఫీసులో పరిస్థితులు చక్కదిద్దాలని మండలవాసులు రిక్వెస్టు చేస్తున్నారు.