• మరింతగా బీటలు వారితే .. ప్రమాదం పొంచినట్టే
  • మరమ్మతులు చేయించాలని ప్రజల వేడుకోలు

వేద న్యూస్, ఫోకస్ టీమ్:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని భట్టుపల్లి-కడిపికొండ ప్రాంతంలోని రాజీవ్ స్వగృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి!. నిరుపేదలు నివాసముండే ఈ ఇండ్లలో ఎప్పుడేమి జరుగుతుందో? తెలియని భయానక పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇండ్ల గోడలకు పగుళ్లు రావడమే కాదు..అక్కడక్కడ ఇప్పటికే పెచ్చూలుడి పడ్డాయి. ఇక గోడల నుంచి ఇంకొద్దిగా బీటలు వారితే ఆయా ఇండ్లలో ఉండే తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టేనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొంచిన ప్రమాదం

ప్రస్తుత వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కుండపోత వానల వల్ల సదరు బిల్డింగుపైన ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాజీవ్ గృహాల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. గోడలకు పగుళ్లు, బీటలు త్వరగా వస్తుండటం బట్టి చూస్తే..నామ్ కే వాస్త్ నిర్మాణాలు చేపట్టారా? అనే సందేహాలు వస్తున్నాయి.

 

ఆయా హౌజెస్‌లో ఉంటున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. కాగా, భారీ వానలు కురిస్తే గోడలు తడిచి తడిచి బీటలు రావచ్చని, వెంటనే కాంట్రాక్టర్ చేత మరమ్మతులు చేపట్టే విధంగా సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఒకవేళ ప్రమాదవశాత్తు భవనం కూలితే మాత్రమే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మానవతా దృక్పథంతో అధికారులు స్పందించాలని కోరుతున్నారు. శిథిలావస్థలకు చేరుకున్న రాజీవ్ స్వగృహాల మరమ్మతులకు ప్రాధాన్యతనివ్వాలని వేడుకుంటున్నారు.