• ఇంపాక్ట్ ట్రైనర్‌తో పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు కైవసం

వేద న్యూస్, వరంగల్:

హైదారాబాద్ లో ఈ నెల 21, 22 వ తేదీలలో జరిగిన ‘ఇంపాక్ట్ ట్రెయిన్ ద ట్రెయిన్’ వర్క్ షాప్ లో 60 మందితో నిర్వహించిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన నిరుపేద బిడ్డ జినుకల జ్యోతి తన ప్రతిభను కనబరిచి సత్తా చాటారు. 

ఇంపాక్ట్ ట్రైనర్ తో పాటు బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ప్రశంసాపత్రంతో పాటు అవార్డును అందుకున్నారు. ఒక నిరుపేద బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ఇంపాక్ట్ రూపకర్త గంప నాగేశ్వర్ రావు స్థాపించిన సంస్థలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ముందుకెళ్తానని, తనతో పాటు సమాజంలో అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి… అనే అభిప్రాయంతో తన బాధ్యతను నిర్వహిస్తున్నానని ప్రమాణం చేసినట్టు తెలిపారు.

తనకు ఈ అవార్డు దక్కడం  గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను ఈ అవార్డు అందుకోవడానికి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.