వేద న్యూస్, హనుమకొండ బ్యూరో:

రైతు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ,ప్రజా ప్రభుత్వం రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.గురువారం కాజీపేట సోమిడిలో నూతనంగా వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.

గతంలో కొనుగోలు కేంద్రం అందుబాటులో లేక రైతు దూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి అమ్మేవారని తమ ఆవేదన అర్థం చేసుకుని రైతుల పక్షపాతిగా నిలిచిన ఎమ్మెల్యేకి స్థానిక రైతులు సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బలంగా ఉంటే గ్రామం బలంగా ఉంటుంది, గ్రామం బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది. గతంలో పాలించిన నేతలు కూడా సోమిడి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. కానీ, మా ప్రభుత్వం ఆ లోటును గుర్తించింది.

స్థానికంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే కాజీపేట, సోమిడి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించి జిల్లా కలెక్టర్‌, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష జరిపి, సోమిడిలో కచ్చితంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేశాను.

ఇంతవరకు సోమిడి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల రైతులు సమీప ప్రాంతాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇకపై రైతులు మీ గ్రామంలోనే ధాన్యం విక్రయించగలిగేలా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

రైతు మన రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభం. ఆయన చెమట చిందిస్తేనే మన కుటుంబాలు అన్నం తింటాయి. ప్రతి రైతు ధాన్యానికి సరైన ధర లభించాలి, ఎవరూ నష్టపోకూడదు ఇదే మా ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులు మధ్యవర్తుల జోలికి వెళ్లకుండా నేరుగా ప్రభుత్వానికి అమ్మే అవకాశం కలుగుతుంది. ధరలో పారదర్శకత ఉంటుంది,

డబ్బులు సమయానికి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇది రైతు గౌరవాన్ని కాపాడే దిశలో పెద్ద అడుగు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు క్షేమం రుణమాఫీ పథకం ద్వారా రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాం. రైతు బంధు పథకాన్ని పారదర్శకంగా కొనసాగిస్తూ, ప్రతి ఎకరాకు నేరుగా రైతుల ఖాతాల్లో సహాయం జమ అవుతుంది. రైతు బీమా ద్వారా పంట నష్టం కలిగినప్పుడు రైతు కుటుంబాలకు తక్షణ సాయం అందించబడుతుంది.

పంట ఉత్పత్తి మెరుగుపడటానికి ఉచిత విద్యుత్, ఎరువుల సరఫరా, రైతు సమన్వయ సమితులు వంటి చర్యలతో గ్రామస్థాయి నుండి రైతు దాకా పూర్తి మద్దతు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,సయ్యద్ విజయశ్రీ రాజాలి ,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.