- వార్డెన్ పై కమలాపూర్ ఎంపీడీవో తీవ్ర ఆగ్రహం
- ఆకస్మిక తనిఖీ చేసిన మండల అధికారి
వేద న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూ కు సంబంధించిన ఆహార పదార్థాలు బియ్యం, కూరగాయలు వాటి నాణ్యతను పరిశీలించారు. అక్కడే పాడైపోయి ఉన్న ఉల్లిగడ్డలను చూసి హాస్టల్ వార్డెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాడైపోయిన కూరగాయలను ఎప్పటికప్పుడు తొలగించి తాజా కూరగాయలను మాత్రమే కొనుగోలు చేయాలని, వాటితో మాత్రమే వంట చేసి విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని హాస్టల్ వార్డెన్ కట్టయ్య ను ఆదేశించారు.
ఈ వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నందున హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వసతి గృహంలోని గదులు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే టాయిలెట్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా తగిన రిపేర్లు చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ఆడుకోవడానికి వాలీబాల్, షటిల్ వంటి ఆటకు సంబంధించిన కోర్టులు హాస్టల్ ఆవరణలో ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులకు భోజనం అందించే విషయంలో అలసత్వం ప్రదర్శించరాదని మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులకు హాస్టల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దానికి తగ్గట్లుగా హాస్టల్ సిబ్బంది కృషి చేయాలని హాస్టల్ వార్డెన్ కు ఈ సందర్భంగా ఎంపీడీవో గుండె బాబు సూచించారు.