- ప్రకృతి వనరులు ప్రభుత్వ ఆస్తులు కాదు.. జాతీయ ఆస్తులు!
ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు, అన్నిరకాల జీవరాసి మనుగడకు, రాబోవు తరాలకు సుస్థిర జీవనానికి వనరుల సంరక్షణ లక్ష్యంతో పర్యావరణహితంగా ఉండాలి. ఇటీవల జరుగుతున్న వేగవంతపు మార్పులు, తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి ముసుగువేసుకొని వనరుల విధ్వంసం దిశగా పరుగేడుతోంది. ఓవైపు సహజ వనరులను కాపాడాలని, భూమిపై, సముద్రాలలో, ఆకాశంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను అదుపులో ఉంచేందుకు దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో.. అంతర్జాతీయ వేదికలపై హరిత పర్యావరణం కోసం శాస్త్రియ దృక్పథంలో మార్పులు సంధిస్తూనే.. మరోపక్క ప్రకృతి విధ్వంసానికి అనేక రూపాలలో వివిధ వికృతాలచే అక్రమ సంపాదన, వనరులను ఒకేసారి డబ్బు రూపంలోకి మార్చేందుకు అజమాయిషీ, ఆధిపత్యాల కోసం మనిషి వివిధ మాధ్యమాలను ఉపయోగిస్తున్నాడు.
అందులో పరిపాలన ముసుగులో దేశాలను వశం చేసుకునే దిశగా ముందుకెళుతూ వనరులను విధ్వంసం చేస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో, వ్యక్తులతో కలిసి ఏజెంట్లుగా మారి అధికారంతో వనరులను.. ‘కంచే చేనుమేసిన చందంగా’ బహుళజాతి సంస్థలకు దోచిపెడుతూ, దోచుకుంటుంటే ఆపాల్సింది ప్రజలే.
ఎందుకంటే భవిష్యత్తులో వనరుల లేమితో సమస్యలను ఎదుర్కునేది ప్రజలే కాబట్టి. అంతర్జాతీయంగా కూడా ఇదేపరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భయపెట్టే సత్తా చేకూర్చుకుని బలమున్నోడిదే రాజ్యమవుతుంది.
దేశ సుస్థిరతకోసం, దేశ ప్రజల జీవన సౌలభ్యం కోసం పరిపాలన జరగాలి. అందుకోసం పాలకులు సంపద సృష్టించాలి. ఆ దిశగా దేశ ప్రణాళికల రచనలు, పరిపాలన నిర్వహణలు ఉండాలి. కానీ ఆ పరిపాలన, ప్రణాళికరచనలు కొందరికే పరిమితం కావడం, అదే దేశ అభ్యవృద్ధి అనుకోవడం మోసపురితమే అవుతుంది.
సామాన్య ప్రజాజీవితాలకు భ్రమకల్పిస్తూ వారిని అంధకారంలోకి నెట్టివేసి భవిష్యత్తును నిర్వీర్యం చేయడమే అవుతుంది. ఇది దేశానికే పెద్ద ప్రమాద సూచిక. తమ స్వప్రయోజనాలు, తమ గెలుపు, స్వార్థ రాజకీయాలకోసం జాతీయ సంపదలైన అడవులను, సహజవనరులను, నిధి నిక్షేపాలను, దేశ ఆస్తులు, భూములను అభివృద్ధి, సుపరిపాలన, పేదరిక నిర్ములన అనే ముసుగులో అధికార దుర్వినియోగంతో ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అమ్మివేయడం సు పరిపాలన ఎలా అవుతుందో? ప్రజలు అర్థం చేసుకోవాలి.
ప్రకృతి హెచ్చరికలు పట్టవా?
దేశం వెలిగిపోతుందని ఒకరు, ప్రజాపరిపాలన అని మరొక్కరు ఇలా పరిపానను అడ్డు పెట్టుకొని జాతీయ సంపదను, జాతీయ ఆస్తులను రేపటితరాల జీవన సుస్థిరతకు తవులేకుండా, రాబోవు తరాలను అగాథంలోకి నెట్టి వేయడమే అవుతుంది.
పర్యావరణ సమతుల్యతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలోని లొసుగులను అదునుగా చేసుకొని నిధులను ఇతరులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం, ఆచరనీయం? ఇప్పటికే ప్రకృతి అనేక విపత్తులను పరిచయంచేస్తూ హెచ్చరిస్తూనే ఉన్నది.
అయినా ఇలా తెలిసి విపత్తులను అనుభవిస్తూ సహజ వనరులను, జాతీయ సంపదను లూటి చేయడం, భవిష్యత్తును తెలిసి చెరపట్టడమే అవుతుంది. ఇది సహజ వనరుల, పర్యావరణ సుస్థిరతకు విఘాతమే అవుతుంది. ప్రభుత్వాలు సంపదను సృష్టించి అభివృద్ధి చేస్తూ పరిపాలన చేయాలి. కానీ, ఉన్న దేశ, రాష్ట్ర జాతీయ సంపదను, ఆస్తులను చెరబట్టి అమ్ముకొని పరిపాలించడమేమిటో, ఈ పరిపాలన ఎవరికోసమో, దానివెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థం చేసుకోవాల్సిన తరుణం ఇది.
సంపదను సృష్టించలేనివాడికి నాశనం చేసే హక్కు అధికారం ఎక్కడిది ఎవరిచ్చారు..? ప్రజలు.. నాయకులను, ప్రభుత్వాలను ఎన్నుకునేది సంపదను సృష్టించి పాలించాలని. అలాకాకుండా అధికారం చేతుల్లో అడ్డుపెట్టుకొని ప్రజలను చెప్పుచేతుల్లో మోసం చేస్తే, ఉన్న దేశ ఆస్తులను మాయం చేస్తూ సూపరిపాలన అనే భ్రమ కల్పిస్తూ కొనసాగుతున్న పరిపాలన మోసమే తప్ప ప్రజాపాలన ముమ్మాటికీ కాలేదు.
దేశ ఆస్తులను, జాతీయ సంపదను అభివృద్ధి, పరిపాలన ముసుగులో ఇలా అమ్ముకుంటూ పోతే రేపటి ప్రభుత్వాలు పరిపాలన ఎలా కొనసాగిస్తాయి. చివరికి ప్రజల బతుకులు ఎవరి చేతుల్లోకి వెళ్లిపోతాయో ఆలోచించాల్సిన అవరమెంతైనా మన అందరిపైన ఉన్నది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు దేశ ఆస్తులను, సహజవనరులను ప్రజా అవసరాలకు మించి కోళ్లగొట్టడం ఆపివేయకపోతే దేశ భవిష్యత్తు అంధకారమే. సంపదను సృష్టించుకుంటూ, ఉన్న దేశ సంపదను కాపాడుకునే దిశగా ఆలోచించు కోవాలి.
బ్రెజిల్.. అమెజాన్ అడవులను కాపాడుతూ, ఆదివాసీల ఉపాధిని పెంచడానికి, మైనింగ్‌పై ఆధారపడకుండా ‘బయో ఎకానమీ’ అనే సుస్థిర ఆర్థిక నమూనాను అభివృద్ధి చేస్తోంది. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, జీవారణ్యాల మనుగడ మానవ మనుగడకు అత్యవసరం అని బ్రెజిల్ చాటి చెబుతోంది. దీనికి విరుద్ధంగా.. భారతదేశంలో 2024-2025లో తీవ్ర వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల అసంఘటిత రంగ కార్మికుల్లో 60 శాతం మంది ఆదాయం కోల్పోయి, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వాయు కాలుష్యం (ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం), విష రసాయనాలు పీల్చడం వలన ప్రజలు శ్వాసకోశ, గుండె, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారు.
ఇక్కడ ‘మంచి గాలి’ ఒక లగ్జరీ వనరుగా, వ్యాపారంగా మారింది. భారత్ ప్రస్తుతం ‘విధ్వంసకర, వినాశకర వికాసం’ దిశగా ప్రయాణిస్తోంది. దేశ కార్బన్ ఉద్గారాలను స్వీకరించే దండకారణ్యం బొగ్గు, బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల తీవ్ర ప్రమాదంలో పడింది.
కార్పొరేట్ మైనింగ్‌ను ప్రతిఘటిస్తున్న ఆదివాసీ ఉద్యమాలను అణచివేయడం, దేశ సంపదను ధ్వంసం చేయడం పరిపాలనా ధర్మానికి విరుద్ధం. ప్రపంచ సంతోష నివేదిక-2025లో భారత్ 118వ స్థానంలో ఉండడం, ప్రజల్లో విద్య, వైద్యం, స్వచ్ఛమైన వనరుల పట్ల ప్రభుత్వ మద్దతు లేదనే అసంతృప్తిని సూచిస్తోంది. ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని, రాజ్యాంగం అందించిన జీవించే హక్కును విస్తృతంగా అమలు చేయాలి.
కార్పొరేట్లను నియంత్రించి, ప్రజల ప్రయోజనాలను పరమార్థంగా పాలన సాగించాలి. కాలుష్య నియంత్రణలో చైనా విధానం, జీవ ఆర్థిక వ్యవస్థలో బ్రెజిల్ విధానం ఆదర్శంగా తీసుకుని, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, అడవుల పెంపుదలను అమలు చేయాలి. పౌర సమాజం అప్రమత్తతతో, ప్రజాస్వామిక పోరాట రూపాలతో ఈ పర్యావరణ వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది.
భూమిపై సకల జీవరాసులకు సమానంగా జీవించే హక్కువున్నది. ఒక్క మానవునికి మాత్రమే ఈ భూమి సొంతం కాదు అనే దృష్టితో ప్రభుత్వాలు పాలన సాగించాలి. పాలకుల విధానం దేశ అభివృద్ధికి, సుస్థిర ప్రజా జీవన, జీవమనుగడదిశకు పర్యావరణ సుస్థిరతకు అనుకూలమై ఉండాలి.
అప్పుడే జాతీయ సహజ సంపదలైన అటవీ సంపద, దేశ భూములు, సహజవనరులు దేశ ఆస్తులుగా అందరికీ సుస్థిర పరిపాలన ఫలాలుగా అంది భవిష్య మానవ, ఇతర జీవరాసి సుగమ జీవనానికి బాటవేసి బాసటగా పాలన నిలుస్తుంది.
– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి

