= పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని సెస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లాలోని 15 మండలాలకు చెందిన ప్రతినిధులు, అసిస్టెంట్ హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలుమార్లు వినతిపత్రాలు, మెమోరాండంలు సమర్పించినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, సేవా సంవత్సరాల ఆధారంగా మానిటరీ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ఏడు నెలలుగా నిలిపివేసిన ఎఫ్‌టిఏ చెల్లింపులను పునరుద్ధరించాలని, వర్క్ నార్మ్స్ ప్రకారం కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. ఉద్యోగుల భద్రత కోసం రక్షణ పరికరాలు అందించడంతో పాటు టీజీఎన్‌పీడీసీఎల్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, అసిస్టెంట్ హెల్పర్స్ పేరును జూనియర్ లైన్‌మెన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. సెస్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.