•  కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు గౌరవం కల్పిస్తా
  •  కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టుదల, కృషి తోనే ఎమ్మెల్యేగా గెలిచానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, దామెర మండలాల, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ గ్రామ, వార్డు, బూత్ స్థాయి నాయకులతో ఆయా మండల, పట్టణ పార్టీ అధ్యక్షుల అధ్యక్షతన సమీక్షా సమావేశాలు వేరు వేరుగా నిర్వహించారు. ఈ సమావేశాలలో ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు .

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పట్టుదలతో పనిచేయడం వల్లే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని, తన గెలుపు కార్యకర్తలకు అంకితం అని వెల్లడించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కేసీఆర్ దుర్మార్గపు పాలనతో ప్రజలు విసిగి..బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడారని చెప్పారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులు విభేదాలు వీడి సమిష్టిగా పనిచేసి ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకునేందుకు..ఏడు నియోజకవర్గాలలో పరకాల నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోలయ్యేట్లు కృషి చేయాలని సూచించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. సమావేశాలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.