- వరంగల్ ఎంపీ బరిలో విద్యావేత్త జన్ను
- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావి
- అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు
- విద్యావేత్త జన్ను పరంజ్యోతి వైపు..కాంగ్రెస్ చూపు!
- వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ
వేద న్యూస్, వరంగల్:
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, అగ్రనాయకత్వం అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సీటుకు అభ్యర్థిని ఖరారు చేశారు. కోడంగల్ లోని కోస్గి సభలో రేవంత్..మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో హస్తం గెలుపే లక్ష్యమని, యుద్ధానికి సన్నద్ధమేననే సంకేతాలు పంపారు.14 స్థానాలు గెలిస్తేనే యుద్ధం ముగిసినట్లని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు రేవంత్ దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే ఉత్కంఠ సైతం నెలకొంది.
ఇక అన్ని సీట్లలో కెల్లా వరంగల్ ఎంపీ సీటుకు ఉన్న ప్రాధాన్యతయే వేరు అన్నట్లుగా ఈ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారు. అందరి చూపు వరంగల్ లోక్ సభ సీటుపైన ఉంది. ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో తలమునకలవుతూ..తమకే టికెట్ వరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. దానికి తోడు జిల్లా నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా సరైన అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు ఖాయమేనని ఆ పార్టీ వర్గాల ధీమాగా ఉన్నాయి. ఈ పూర్వపరాల దృష్ట్యా హస్తం అధిష్టానం వరంగల్ ఎంపీ టికెట్ కోసం అభ్యర్థుల వడపోతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టాక్. విద్యావేత్త జన్ను పరంజ్యోతి పేరు తాజాగా పరిశీలనలోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

పరంజ్యోతి వరంగల్ నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ విద్యావేత్తగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో సైతం పరంజ్యోతి తన వంతుగా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తో సన్నిహిత సంబంధం కలిగి, ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రేరణ పొందిన వ్యక్తి పరంజ్యోతి. ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వం పట్ల అమితమైన గౌరవం కలిగిన ఉద్యమకారుడు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యనే సరైన మార్గాన్ని విశ్వసించిన పరంజ్యోతి ఒయాసిస్ ఎడ్యకేషన్ ఇన్ స్టిట్యూషన్ స్థాపించారు. విద్యతోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం, గౌరవం దక్కుతుందని జన్ను మనసా వాచా కర్మేనా విశ్వసిస్తారు. విద్యా రంగంలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

ఎడ్యుకేషనిస్ట్ గా 30 ఏండ్ల అనుభవం కలిగిన పరం జ్యోతి తన అనుభవాన్ని పలువురికి పంచడంలో ఎప్పుడూ ముందుంటారు. షమేరి ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్ స్థాపించి…విద్యార్థుల కోసం స్టడీ స్కిల్స్, గైడెన్స్ పై తల్లిదండ్రులకు ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, సైకాలజీ, క్లాస్ మేనేజ్ మెంట్, టెక్నాలజీ, మెథడాలజీ, క్లాస్ మేనేజ్ మెంట్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేపట్టారు. ఉమ్మడి ఏపీగా ఉన్న సమయంలోనే అనేక జిల్లాలకు చెందిన ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ కు పరంజ్యోతి ‘సీపీఈపీస్’(కరస్పాండెంట్ ప్రొఫెషనల్ ఎన్ రిచ్ మెంట్ ప్రోగ్రాం) చేపట్టి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో పాటు విద్యావ్యవస్థలో మార్పులకు తన వంతు సూచనలు, సలహాలు పరంజ్యోతి ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తున్నారు.
1994లో విద్యాచట్టం జోవో నెం.1లో సవరణలపై జన్ను పరంజ్యోతి అప్పటి ప్రభుత్వానికి, విద్యాశాఖకు సూచనలు ఇచ్చారు. స్టేట్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహించే సలహాదారుల కమిటీ సభ్యులుగా పరంజ్యోతి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నారు. టీచర్స్ తో పాటు స్టూడెంట్స్ కు ఉపయోగపడే నవీనమైన ఆవిష్కరణలను పరంజ్యోతి తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం భారతదేశంలో తొలిసారి ‘అకాడమిక్ అచీవ్ మెంట్ ఫైల్స్’ ను రూపొందించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధనా పద్ధతులు, విద్యా బోధనకు అవసరమయ్యే పరికరాలు, అడ్మినిస్ట్రేటివ్ రికార్డును మెరుగు పరిచారు. ప్రస్తుతం ఈ పద్ధతులను దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తుండటం విశేషం. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి పలు అవార్డులు సైతం జన్ను పరంజ్యోతిని వరించాయి.

వరంగల్ దేశాయిపేట రోడ్ లోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్(సీబీఎస్ఈ) చైర్మన్, కరాస్పాండెంట్ గా ఉన్న పరంజ్యోతి..ఈ స్కూల్ ను 1985లో స్థాపించారు. ఈ విద్యా సంస్థ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ర్యాంకులు, అవార్డులు, బహుమతులు సాధించింది. షమేరి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఒయాసిస్ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు పేద విద్యార్థులకు అవసరమైన సామగ్రి అందజేస్తూ సహకరిస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో ఉపాధి కోల్పోయిన ఎంతో మందికి నిత్యావసరాలను అందజేసి పరంజ్యోతి తన సేవాభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావిగా తన వంతు పాత్రను కీలకంగా జన్ను పరంజ్యోతి పోషించారు.
1980 నుంచి తన మదిలో ‘తెలంగాణ’ అనే నినాదాన్ని పదిలంగా భద్రపరుచుకున్న జన్ను పరం జ్యోతి..జయశంకర్ స్ఫూర్తితో విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి అనేక మేధో పరమైన చర్చల్లో సమయం వెచ్చించారు. తెలంగాణ మేధావులైన దాశరథి రంగాచార్య, దేవులపల్లి రామానుజరావు, కాళోజీ వంటి వాళ్ల కవిత్వాలకు ఆకర్షితుడైన వర్తమాన కవిగానూ ఎదిగారు.

ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో ఆనాటి ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలో ఉద్యమానికి మద్దతు తెలిపి..ఉద్యమంలో ప్రైవేట్ పాఠశాలలను భాగస్వామ్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యేకించి ‘సకల జనుల సమ్మె’లో తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్ మెంట్ లను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. వరంగల్ లోని ఒయాసిస్ స్కూల్ లో తెలంగాణలో ని 10 జిల్లాలకు చెందిన దాదాపు 1,500 మంది ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ తో మీటింగ్ నిర్వహించారు.
‘సకల జనుల సమ్మె’లో తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులుగా జన్ను పరంజ్యోతి ఉద్యమాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. తెలంగాణ మేధావుల ఫోరం నాయకులుగా తన వాదనను పరంజ్యోతి బలంగా వినిపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, సుబ్రమణ్యస్వామితో పాటు ఇతర జాతర నాయకులతో సత్సంబంధాలు కలిగిన జన్ను..2012 ఆగస్టు 2న హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ ‘‘అఖిల భారత చిన్న రాష్ట్రాల ఫోరమ్’’ మీటింగ్ ఏర్పాటు చేశారు.

మేధావిగా, వక్తగా, ప్రొఫెషనల్ ట్రైనర్ గా, మోటివేటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన జన్ను పరంజ్యోతి కవిగా, గేయ రచయితగానూ పేరు గడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఆయన రాసిన ‘జయహో తెలంగాణ’ పాట విశేష ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇంతటి బ్యాగ్రౌండ్ కలిగిన విద్యావేత్త జన్ను పరంజ్యోతిని వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయమై అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వినికిడి. తెలంగాణ ఉద్యమకారుడిగానూ కీలక పాత్ర పోషించిన పరంజ్యోతిని వరంగల్ అభ్యర్థిగా నిలిపి..గెలిపించి..ఢిల్లీకి పంపితే రాష్ట్ర ప్రగతికి అవసరమయ్యే పనులు జరుగుతాయని భావిస్తున్నట్లు సమాచారం.