– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు
– విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి
వేద న్యూస్, ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలంలో నర్సక్క పేట – జవార్ పేట గ్రామాల మధ్య రాకపోకలు కొనసాగించే దారిలో బిక్క వాగు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్న సమయంలో ప్రయాణికుల రాకపోకలకై వాగుపై తాత్కాలిక రోడ్డు వేసే క్రమంలో వాగు నీరు వెళ్లడానికి పైపులను వేశారు.కొన్ని రోజుల తర్వాత బ్రిడ్జి నిర్మాణం పూర్తి జరిగిన అనంతరం తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన పైపులు నిరుపయోగంగా మారడంతో, ఇదే అదునుగా భావించిన ఓ పార్టీ నాయకుడు ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో 5 పైపులను దొంగలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క పైపు విలువ సుమారు 25వేల రూపాయలు విలువ చేస్తుంది. అంటే ఈ లెక్కన ఒక లక్ష 25 వేల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఆ పార్టీ నాయకుడు దొంగిలించినట్టే అని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ సొమ్మును ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే దొంగిలించడం చట్టరీత్యా నేరమని అతడికి తెలియదా?. అసలు ప్రభుత్వ ధనాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా దొంగిలిస్తున్న సమయంలో సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై ఎందుకు విచారణ చేసి చర్యలు తీసుకోవడం లేదు? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అధికారుల అండదండలతో తనని ఎవరు ఏమి చేయలేరు అనే ధైర్యంతో ఇలా ప్రభుత్వ ధనాన్ని మాయం చేయడానికి ఆ నాయకుడు సిద్ధమైనట్లు
తెలుస్తోంది. అదే సామాన్య ప్రజలు ఇలా చేస్తే అధికారులు చూస్తూ ఊరుకునే వారా?. లేని పోనీ హడావిడి చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని విచారణ, కేసులు వంటి చర్యలు తీసుకొని ఉండేవారు కదా?.రాజకీయ పార్టీ నాయకుల విషయానికి వస్తే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు, చూసి చూడనట్లు వ్యవహరించడం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి మాయమైన ప్రభుత్వ సామాగ్రిని పార్టీ నాయకుడు నుండి రికవరీ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, కోరుతున్నారు.