- యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
- గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- భవన్లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాల ఆరా
వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి :
అధికార హస్తం పార్టీ “చేతి”లో తమకు చోటు లేదని యాదవ కురుమ, సామాజిక వర్గాలు కినుక వహిస్తున్నాయి.!తెలంగాణ మంత్రివర్గం తో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో యాదవ, కురుమ సామాజిక వర్గాలకు చోటు కల్పించాలని కోరుతూ.. గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం వినూత్న నిరసన చేపట్టింది.
రాజకీయంగా తమకు అవకాశాలు కల్పించాలని అడిగారు. ప్రజా ప్రభుత్వంలో అందరికీ అవకాశం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే క్రమంలో తమకు ప్రస్తుతం దక్కాల్సిన స్థానం కోసం వినూత్న మార్గంలో ఆందోళన చేపట్టారు. గొర్రెల కాపరులు లారీలో గొర్రెలు, మేకలతో గాంధీభవన్ వద్దకు చేరుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
సంక్షేమ సంఘం నాయకుడు శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసే వరకు తమ నిరసన కొనసాగుతుందని యాదవ, కురుమ సంఘం నేతలు తెలిపారు.
కాగా గాంధీభవన్‌లోకి గొర్రెలు తీసుకువచ్చిన ఘటనపై, పోలీసుల భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలీసుల కట్టుదిట్ట భద్రతా ఉన్నా గొర్రెల లారీ లోపలికి రావడంపై కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సంఘ విద్రోహ శక్తులు వస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

కాగా కురుమ, యాదవ సామాజిక వర్గం నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. రాష్ట్ర మంత్రి వర్గంలో తనకు చోటు కల్పించాలని కాంగ్రెస్ అగ్రనేతలకు వినతులను కూడా సమర్పించిన విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలో యాదవ, కురుమలకు ఇప్పటి వరకూ చోటు కల్పించకపోవడం గమనార్హం.
ఇది ఇలా ఉంటే గాంధీభవన్‌లో గొర్రెలు ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గొర్రెలు@ గాంధీభవన్ అంటూ నెట్టింట చర్చలు సాగుతున్నాయి