వేద న్యూస్, వేములవాడ:
హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందుతులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాధవ్ గురువారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
చంద్రగిరి గ్రామానికి చెందిన ముత్త శరత్‌పై 2020, డిసెంబర్ 25న అదే గ్రామానికి చెందిన దేశావేని లింగయ్య, దేశవేని కనకరాజు, దేశవేని శ్రీనివాస్, దేశవేని కనకవ్వ, దేశవేని సరోజన, చోక్కల్ల తిరుమల్లు భూమి విషయంలోని పాత గొడవలు మనసులో పెట్టుకుని దాడి చేశారు. బాధితుడు శరత్‌కు తీవ్ర గాయం కాగా, చికిత్స నిమిత్తం సిరిసిల్ల హాస్పిటల్‌కు తరలించారు.
ఘటనపై వేములవాడ పోలీస్ స్టేషన్‌లో శరత్ తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టు లో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, సిఎంఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు, కానిస్టేబుల్ మధుసూదన్, కోర్టు కానిస్టేబుల్ సురేశ్‌లు కోర్టులో సాక్ష్యులను ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గౌరు రాజీ రెడ్డి వాదించగా, కేసు పూర్వపరాలను పరిశీలించిన అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజేయ్ కుమార్ జాదవ్.. ఆరుగురు నిందితులకు ఐదేండ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు.
పైకేసులో నింధితులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి విచారణ అధికారులు సీఐ వెంకటేష్, ప్రస్తుత సీఐ వీరప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీ రెడ్డి,సిఎంఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు, సిఎంఎస్ కానిస్టేబుల్ మధుసుదన్, కోర్ట్ కానిస్టేబుల్ సురేష్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.