వేద న్యూస్, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో గొర్రెల చోరీ నిందితులను వెంటనే పట్టుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. కొదురుపాక లో సోమవారం బాధిత యాదవులతో మాట్లాడి చోరీ సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక పోలీసులతో మాట్లాడి వెంటనే చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకోవాలని కోరారు. కొదురుపాకకు చెందిన పెంజర్ల తిరుపతికి చెందిన 21 గొర్రెలు, మల్యాల బాలయ్య కు చెందిన 10, ఎల్లయ్యకు చెందిన ఏడు గొర్రెలు దొంగలు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవాలని యాదవులకు న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు వీరవేణి మల్లేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.