- అందరికీ చర్చకు ఫేవరెట్ స్పాట్‌గా ‘రాజేశ్ స్వీట్ హౌస్’
- సమాచారం తెలియాలంటే ఇక్కడికి రావాల్సిందే..!
- చక్కగా ఛాయ్ తాగుతూ కబు ర్లు, చర్చలకు వేదిక ఇది..
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ప్రస్తుత ఉరుకుల పరుగుల డిజిటల్ ప్రపంచంలో..ఏదైనా విషయమై చర్చ, అభిప్రాయాలపై డిస్కషన్, సమాచార సేకరణ అనేది అత్యంత కీలకం. కాగా, గ్రేటర్ వరంగల్ ప్రజానీకానికి ఈ ప్రదేశం ఫేవరెట్ డిస్కషన్ అడ్డాగా కొనసాగుతుండటం విశేషం. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అండర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న రాజేష్ స్వీట్ హౌస్ నగరవాసులకు చక్కటి చర్చావేదికగా కొనసాగుతోంది. వరంగల్ నగర పరిధిలోని పోలీసులు, జర్నలిస్టులు, పొలిటీషియన్స్, కూలీలతో పాటు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ..ఇక్కడికి వచ్చి చర్చలు నిత్యం కొనసాగిస్తుంటారు.
హమారా అడ్డా…
రాజేశ్ స్వీట్ హౌస్ ‘హమారా అడ్డా..’ అన్నట్టుగా చాలా మందికి.. ఇక్కడికి రాకపోతే పొద్దుపోదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంత మంది అయితే ఎన్ని పనులున్నా వాటిని ముగించుకుని మరీ ఇక్కడికి వచ్చి.. ఛాయ్ తాగి ముచ్చట్లు కొనసాగిస్తూ తమ చర్చలను ఈ ప్రదేశంలో జరుపుతుంటారు.
ఇక్కడికి రాకపోతే తమకు గ్రేటర్ వరంగల్ నగరానికి సంబంధించినది అయినా లేదా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఏం జరుగుతున్నదనే సమాచారం తెలియదని కొందరు జర్నలిస్టులు పేర్కొంటున్నారు. తాము సమాచార సేకరణకు నిత్యం ఈ స్వీట్ హౌస్ వద్దకు వస్తామని, ఛాయ్ తాగి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ.. ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూనే.. ముఖ్యమైన సమాచారాన్నీ సేకరిస్తుంటామని అంటున్నారు.
ఈ ప్రదేశానికి రావడం ద్వారా తాము తూర్పు పరిధిలోని కీలకమైన నేతలు, అధికారుల అభిప్రాయాలనూ సులభంగా సేకరించగలుగుతామని, తమ పరిచయాలు మరింత విస్తృతమయ్యాయనీ వెల్లడించారు. మొత్తంగా ‘రాజేశ్ స్వీట్ హౌస్ ..’ అనేది తమకు ప్రజలకు ‘సమాచార భవన్’ మాదిరిగా ఎంతో సమాచారాన్ని అందిస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురు పేర్కొన్నారు.
