- పర్యావరణవేత్త రవిబాబుకు సమాచారం
- బాధ్యతగా జూపార్కుకు దానిని అప్పగింత
- ఈ తాబేలు దత్తతకు రూ.2 వేలు చెల్లించిన మనీ రాయల్
వేద న్యూస్, ఓరుగల్లు:
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ రైతు వనమాల శ్రీధర్‌కు ఇటీవల తన వ్యవసాయ భూమి దున్నుతుండగా ఒక అందమైన, అరుదైన తాబేలు దొరికింది. దానిని ఆ రైతు తన ఇంటికి తీసుకెళ్లిన శ్రీధర్..ఈ విషయాన్ని ‘ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ’’ స్వచ్చంద సంస్థ, వరంగల్ జాయింట్ సెక్రెటరీ, పర్యావరణ వేత్త పిట్టల రవిబాబుకు తెలిపారు. ఆయన దానిని పరిశీలించి అది అరుదైన ఒక భారతీయ నక్షత్ర తాబేలు (జియోచెలోన్ ఎలగాన్స్) గా గుర్తించి అది వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972, షెడ్యూల్ -4 కిందికి వస్తుందని వెల్లడించారు. అరుదైన రెప్టైల్ జాతి జీవి అని, దాన్ని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంటుకు అప్పచెప్పాలని తెలియపరిచారు. కాగా, రైతు శ్రీధర్ మీరే అప్పజెప్పండి అని నక్షత్ర తాబేలును రవి బాబుకు అప్పజెప్పారు.
దానిని బాధ్యతగా తీసుకొని రవిబాబు వెంటనే ఈ సమాచారాన్ని కాకతీయ జూలాజికల్ పార్క్ హనుమకొండ ఎఫ్‌ఆర్‌వో మయూరికి తెలియపరిచారు. వెంటనే స్పందించిన మయూరి దానిని జూ కు తీసుకురావాలని ఆదేశించారు.
భారతీయ నక్షత్ర తాబేలును సురక్షితమైన డబ్బాలో పెట్టుకుని దానిని జూ పార్కు తరలించి..అక్కడ ఉన్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాందాస్ సమక్షంలో దానిని జూ పార్కులో అప్పజెప్పారు. దానిని వెంటనే అక్కడే ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సాంబరాజు చేత పరిశీలన చేయించి అది ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారణ చేసిన తర్వాత.. దానిని ఒక ప్రత్యేకమైన జాలిగదిలో వేసి క్వారంటైన్ చేయించారు.
ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాందాస్ నక్షత్ర తాబేలును ఇచ్చినట్టుగా రశీదు రవి బాబుకు ఇచ్చారు. సదరు అరుదైన నక్షత్ర తాబేలును పోషణ నిమిత్తం ఎవరికైనా ‘‘కాకతీయ జూ యానిమల్ అడాప్షన్ స్కీం’’ కింద దత్తత ఇవ్వాలని, ఒక సంవత్సరానికి సరిపడా రుసుము చెల్లింప చేయించాలని జంతు ప్రేమికురాలు, కవయిత్రి, సాహితీవేత్త.. మనీ రాయల్ టీచర్, మహబూబ్‌నగర్‌ను కోరగా వెంటనే స్పందించి ఆమె దానికి ఒక సంవత్సరానికి సరిపడా పోషణ నిమిత్తం రుసుము రూ.2 వేలు ఇచ్చి దత్తత తీసుకొని ఆ జంతువులపై ఉన్న ప్రేమను తెలియపరిచి ఆదర్శంగా నిలిచారు.
అంతరించిపోతున్న అరుదైన జాతులలో ఒకటి నక్షత్ర తాబేలు:రవిబాబు
ఈ సందర్భంగా పర్యావరణవేత్త రవి బాబు మాట్లాడుతూ భారతీయ నక్షత్ర తాబేలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మొదలగు దేశాలలో ఈ జాతి ఎక్కువగా ఉంటుందని కానీ, ఇవి ఇప్పుడు అంతరించిపోతున్న జాతులలో ఇది కూడా ఒకటే అని వెల్లడించారు. వీటి అంతర్ధానానికి ఆవాసాల విధ్వంసం, మూఢనమ్మకాలకు సంకతంగా..చీకటి మార్కెట్‌లో అక్రమంగా అంతర్జాతీయ రవాణా చేయడం మొదలకు కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నక్షత్ర తాబేళ్లు వన్యప్రాణి సంరక్షణ చట్టం1972 ప్రకారం వాటిని షెడ్యూల్ – 4 కింద ఇవి వస్తాయని వివరించారు.
ఐయూసీఎన్ రెడ్ జాబితాలో వీటిని విలీప్తమైపోతున్న జీవులలో చేర్చారని, వీటిని రక్షించుటకు కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పీసిస్ (సీఐటీఈఎస్) అప్పెండిక్స్ – I లో చేర్చి రక్షిస్తున్నారని, వీటిని అక్రమంగా పెంచిన, అమ్మిన, తిన్న, రవాణా చేసిన చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని అడవులను జీవులను అన్నిటిని రక్షించుకునే బాధ్యతని గుర్తుచేశారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
భారత పౌరులుగా..అదేవిధంగా మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకునే ప్రాథమిక విధి మన అందరి పైన ఉందని, దానిని మనం భరత రాజ్యాంగం, ఆర్టికల్ 51 ఏ/జీ తెలియజేస్తుందని పేర్కొన్నారు. అరుదైన తాబేలును జూపార్కుకు తరలించే ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఎఫ్ఆర్‌వో మయూరి, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాందాస్, బీట్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సాంబరాజు, ఫారెస్ట్ సిబ్బంది, రైతు వనమాల శ్రీధర్, పిట్టల ఎల్లయ్య, శంకరి జానీ, వలబోజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.