- విషయ పరిజ్ఞానమున్న నేత
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన
- సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు
వేద న్యూస్, వరంగల్:
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక ఆటుపోటులను అధిగమిస్తూ.. సాగుతున్నదిగా చెప్పొచ్చు. విషయ పరిజ్ఞానం మెండుగా కలిగిన సీనియర్ నాయకుడిగా ఉన్న మనోహర్‌రావు.. నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత విభజిత జిల్లాలోని పలు అంశాలపై అవగాహన ఉన్న నేతగా ఉన్నారు. అయితే, రాజకీయాల్లో ఆయన పదవుల కంటే కూడా ప్రజలకు అవసరమయ్యే పనులు జరగాలనే స్వభావంతో ముందుకు సాగడంతో పాటు కొందరి రాజకీయ ఎత్తుగడల వల్ల.. పదవులు తన వరకు చేరలేదని బలెరావు మనోహర్‌రావు పేర్కొంటున్నారు.
విషయపరిజ్ఞానం కలిగిన లీడర్
సాగునీరు, తాగునీరుతో పాటు విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తూ 1990ల్లోనే నాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రిలేనిరాహార దీక్షలు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన నేత బలేరావు మనోహర్‌రావు. కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచి నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నాయకుడిగా పేరు సంపాదించారు.
కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్‌ను క్రమశిక్షణతో నిర్వహించి.. కార్యదక్షుడిగా అధిష్టాన ప్రశంసలు సైతం పొందారు. నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా బలెరావు మనోహర్‌రావు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులే కాదు.. సోనియాగాంధీతో పాటు ఇతర జాతీయ స్థాయి నాయకులు జిల్లాకు వచ్చిన క్రమంలో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
ఈ క్రమంలో తాను ఆర్థికంగా కరిగిపోయినా చేతబూనిన మూడు రంగాల హస్తం పార్టీ జెండాను ఎగురవేయడానికి మొగ్గుచూపారు. ఆరె హక్కుల పోరాట సమితి పక్షాన, స్థానిక సమస్యలపైన పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాటలో నడిచారు. నాటి శాయంపేట సెగ్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేసిన బొచ్చు సమ్మయ్య శిష్యుడిగా, వర్గీయుడిగా మనోహర్‌రావు ముందుకు సాగారు. అయితే, కాలక్రమంలో ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం సందర్భంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ఉద్యమకారుడు కుసుంబ గంగాధర్ అల్లుడైన బలేరావు మనోహర్‌రావు.. తన సతీమణి పద్మను జెడ్పీటీసీగా బరిలో దించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక వారికి పార్టీలో సముచిత స్థానం లభించకపోయినా పార్టీకి కంకణబద్ధులై సేవలందించారు. ఇక ఆ తర్వాత పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయా సమయాల్లో పార్టీలో ఉన్న నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించడంలో కీలకంగా వ్యహరించారు.
తనకు అక్కడ సముచిత స్థానం లభించడం లేదని గ్రహించిన మనోహర్‌రావు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందర తిరిగి సొంతగూడు అయిన కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని నెలల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురై మంచానికి పరిమితమై ట్రీట్‌మెంట్ పొందిన మనోహర్‌రావు.. మెల్లగా కోలుకుంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణరావు గెలుపునకు శక్తి వంచన లేకుండా ప్రచారంలో తనవంతుగా బలెరావు మనోహర్‌రావు పాల్గొన్నారు.
సీనియర్ నేత అనుభవాన్ని పార్టీ వినియోగించుకోవాలని విజ్ఞప్తులు
సీనియర్ నాయకుడిగా ఉన్న బలెరావు మనోహర్‌రావు సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవడంతో పాటు పది కాలాల పాటు పవర్‌లో ఉంటుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్ నాయకుల అనుభవాన్ని పార్టీ వినియోగించుకోవాలని, తద్వారా పార్టీ మరింత బలోపేతమై పది కాలాలు ప్రజల్లో నిలబడుతుందని కొందరు అంటున్నారు.
నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ప్రస్తుతం భూపాలపల్లి సెగ్మెంట్ అభివృద్ధి పనులపై విషయ పరిజ్ఞానమున్న బలెరావు మనోహర్‌రావుకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే.. ఉద్యమకారుడి కుటుంబానికి, సీనియర్ నాయకుడికి సముచిత గౌరవం లభించినట్టవుతుందని పలువురు వెల్లిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.