•   స్థానిక ఎలక్షన్స్ నేపథ్యంలో ఫుల్ బిజీగా ఈ ప్లేస్
  •  వేడి వేడి చాయ్ తాగుతూ.. ఎన్నికల వ్యూహాలు
  •  సుమారు 20 ఏండ్లకుపైనే చరిత్ర ఉన్న హోటల్..
  •  పలువురికి నిత్యం ఇదే అడ్డా.. చర్చాగోష్టి పాయింట్

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:

‘‘అన్నా.. ఏడున్నవ్.. నిన్ను అర్జెంట్‌గా కలవాలె.. నీతోటి ముఖ్యమైన ముచ్చట మాట్లాడాలె..’’ ఓ తాజా మాజీ ప్రజాప్రతినిధికి కాన్ఫరెన్స్‌లో సర్పంచ్ అభ్యర్థి, అతని అనుచరుడు ఫోన్‌లో అడిగారు. ‘‘కొంచెం బిజీగా ఉన్నా.. తర్వాత కలుద్దాం.. తీయ్’’ అని అవతలి వైపు నుంచి స్పందన వచ్చింది. ‘‘అరె.. గట్ల కాదు అన్న.. చానా ముఖ్యమైన డిస్కషన్ నీ తోటి చెయ్యాలె.. జర టైం.. ఇవ్వు’’ అని ఇవతలి వైపు నుంచి మరోసారి రిక్వెస్ట్ చేశారు. దాంతో ఇక తప్పేటట్లు లేదు అన్నట్టు కదా.. అని ముక్తాయింపుగా సదరు లీడర్ ‘‘సాంబు హోటల్‌కు రండి’’ అని చెప్పి.. కాల్ కట్ చేస్తున్న.. అని చెప్పే లోపు.. ‘‘పెద్దన్నా.. మేము సాంబు హోటల్ కాడనే ఉన్నాం’’ అని వాళ్లు చెప్పారు..

 

అలా..వాళ్లు సాంబు హోటల్‌కు వచ్చేశారు. ఇక అప్పటికే ఆ హోటల్‌కు వచ్చిన వాళ్లు అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. మొత్తంగా జిల్లా వాసుల సరదా, సీరియస్ ముచ్చట్లకు కేరాఫ్‌గా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రచ్చబండగా కొనసా..గుతున్న ‘‘సాంబు హోటల్‌’’పై ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనమిది..

ప్రైమ్ ప్లేస్‌లో.. ముచ్చట్లకు వేదికగా..
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపు 20 ఏళ్ల పై చరిత్ర కలిగిన సాంబు హోటల్ జిల్లావాసులకు చర్చా వేదికగా నిలుస్తోంది. ఆసిఫాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఈ హోటల్‌లో నియోజక వర్గ, మండల స్థాయి నాయకులు, అధికారులు, జర్నలిస్టులు నిత్యం పలు విషయాలపై ఇక్కడే చర్చలు జరుపుతారు.

చర్చా వేదికగా కొనసా..గుతున్న ఈ హోటల్‌కు అన్ని ప్రభుత్వ కార్యాలయలకు చేరువలో ఉండటం విశేషమనే చెప్పొచ్చు. అందుకేనేమో.. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లీడర్లు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులతో పాటు ఆఫీసర్లు సైతం ఈ హోటల్‌కు నిత్యం కస్టమర్లుగా వస్తుంటారని పేర్కొనవచ్చు.

అందరి అడ్డాగా..
దరు సాంబు హోటల్‌కు సమీపంలోనే.. కలెక్టరేట్, ఎస్పీ , జిల్లా కోర్టు, ఆర్డీవో, తహసీల్దార్, అగ్నిమాపక కేంద్రం తదితర ప్రభుత్వ కార్యాలయాలకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలోనే లీడర్లు, అధికారులు, లాయర్లు, జర్నలిస్టులు ఇలా అని వర్గాల వారు కలిసే అడ్డాగా, చర్చావేదికగా కొనసాగుతోందని ఓ జర్నలిస్టు వెల్లడించారు.

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు నిత్యం.. ఇక్కడికి వచ్చి ఎన్నికల గెలుపు వ్యూహాలు, బుజ్జగింపులు తదితర అంశాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ సాంబు హోటల్‌కు రాకపోతే తమకు పొద్దుపోదు అనే వారు సైతం కొందరు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నిత్యం ఇదే వారి అడ్డాగా, చర్చాగోష్టి పాయింట్‌గా మార్చుకుని.. వేడి వేడిగా చాయ్.. తాగుతూ..అలా సరదా కబుర్లతో పాటు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రాజకీయాలపైన వ్యాఖ్యానిస్తుంటారు. ఒక్కో సందర్భంలో తాము కలవాలనుకునే లీడర్లో, జర్నలిస్టులో, ప్రముఖులో ఎక్కడా దొరకకపోతే.., సాంబు హోటల్ వద్దకు వచ్చి వెతికితే దొరకొచ్చని ఓ నేత పేర్కొన్నారు.

చాలా కాలంగా తాము ఈ హోటల్ వద్ద తమకు సంబంధించిన పలు విషయాలపై రకరకాల సానుకూల చర్చలు జరుపుతూ.. నిత్యం హోటల్‌కు వస్తుంటామని ఓ విలేకరి చెప్పారు. వార్తల సేకరణతో పాటు లీడర్ల అభిప్రాయాలు, వాయిస్ ఇతర విషయాలపైన ఇక్కడ చర్చించేందుకు వాళ్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.