వేద న్యూస్, చందుర్తి :

యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి మండల కేంద్రంలో అర్థ రాత్రి వరకు యూరియా కోసం మహిళా రైతులు సైతం క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం పడిన అవస్థలు మరవకముందే, చందుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తమ చెప్పులను క్యూ లైన్ లో పెట్టుకొని ఎదురుచూస్తూన్న సంఘటనతో జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.

సోమవారం చందుర్తి వ్యవసాయ సహకార సంఘం ముందు వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా బస్తాల కోసం ఉదయాన్నే అక్కడికి చేరుకొని తమ చెప్పులను లైన్ లో వరుసగా పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్న సంఘటనను చూస్తే, ప్రచారాలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. యూరియా లేక రైతులు నానా అవస్థలు పడుతున్న కూడా సరియైన యూరియాను అందించడంలో లోపాలు ఎక్కడ జరుగుతున్నాయో అని రైతులు వాపోతున్నారు.

అంతేకాకుండా రైతుల అవసరాలను గుర్తించి ఇదే అదునుగా భావించిన కొందరు ప్రైవేటు ఫర్టిలైజర్ వ్యాపారులు మండలంలో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాము ఆరుగలం శ్రమించి వేసిన పంట పైరు చుట్టూ తిరగాలో, లేదా వాటిని కాపాడే క్రమంలో యూరియా బస్తాల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, షాపుల చుట్టూ తిరుగుతూ క్యూలో తమ చెప్పులను సైతం ఉంచి నానా అవస్థలు పడాలో, అర్థం కాక దిక్కు తోచని స్థితిలో రైతులు బేంబీలు ఎత్తుతున్నారు.

దీనితో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనదని రైతులు దిగులు చెందుతున్నారు.కావున ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులతో పాటు ప్రభుత్వం స్పందించి యూరియా నిలువలను నిల్వ చేసి రైతులకు అందుబాటులో తెచ్చి యూరియా కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకొని రైతులను, రైతుల పంట పొలాలను కాపాడవలసిందిగా వారు కోరుతున్నారు.