*పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు*
*అర్హులందరికీ చేయూత పింఛన్లు.. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే *
వేద న్యూస్, పాపన్నపేట
పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. మంగళవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నూతన ‘చేయూత’ పింఛను మంజూరు పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం చేయూత పింఛన్లను అందిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాపన్నపేట తహసీల్దార్ సతీష్ కుమార్, డీఎల్‌పీఓ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
