ఏడుపాయల సన్నిధిలో దీపకాంతుల శోభ..
శివలింగం, గణపతి ఆకృతుల్లో కనువిందు చేసిన కార్తీక దీపాలు!
వేద న్యూస్, పాపన్నపేట
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో, దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆలయ ఆవరణలో అత్యంత వైభవంగా దీపాలంకరణ సేవ మరియు ఆకాశదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు, అర్చకులు అత్యంత సుందరంగా శివలింగం మరియు గణపతి ఆకారాలను తీర్చిదిద్ది, వాటి చుట్టూ వేలాది మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించారు. ఆలయ ఆవరణంతా కార్తీక దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆకాశదీపాన్ని వెలిగించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ అద్భుతమైన దీపాలంకరణను, ఆకాశదీప దర్శనాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. “ఓం నమః శివాయ”, “జై దుర్గా భవాని” అనే నామస్మరణలతో ఏడుపాయల క్షేత్రం మార్మోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
