పాపన్నపేటలో భక్తిశ్రద్ధలతో సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవం..
108 లీటర్ల ఆవు పాలతో మహా పాలాభిషేకం!
వేద న్యూస్, పాపన్నపేట
మండల కేంద్రమైన పాపన్నపేటలోని శ్రీ సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు చెరువుపల్లి విశ్వనాథ శర్మ, నవీన్ శర్మల వేద మంత్రోచ్ఛారణల మధ్య బాబాకు వివిధ రకాల విశేష పూజలు నిర్వహించారు.
108 లీటర్ల ఆవు పాలతో పాలాభిషేకం:
వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాయిబాబా మూలవిరాట్టుకు 108 లీటర్ల స్వచ్ఛమైన ఆవు పాలతో మహా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
భారీ అన్నదాన కార్యక్రమం:
ఈ వేడుకల సందర్భంగా తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గొల్ల మహేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
