వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి/కోరుట్ల:
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ , బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్.. రైతులకు యూరియా అందించే విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. రైతు వేదిక వద్ద మాట్లాడదాం చర్చకు రా.. అంటూ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సవాల్ విసిరారు. దీంతో శనివారం పెద్ద ఎత్తున గులాబీ పార్టీ శ్రేణులు అక్కడికి తరలి రావడం తో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డీఎస్పి అడ్లూరి రాములు పర్యవేక్షణలో బిఆర్ఎస్,కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టారు.ఈ చర్చకు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు వెనుదిరిగారు.
బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కాలి గోటితో కృష్ణరావు సమానమని బిఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులతో అరెస్టులు చేయించినప్పటికీ వెనుకడుగు వేయకుండా భారీ ఎత్తున తరలి రావడంతో కాంగ్రెస్ నాయకులు భయంతో వెనుతిరిగారని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాగా సమాధానం చెప్పినట్లు రుజువైందని బిఆర్ఎస్ నాయకులు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు మాట్లాడుతూ… సుమారు గంటసేపు వేచి చూసినప్పటికీ చర్చకు ఎమ్మెల్యే హాజరు కాకపోవడంతో వెనుదిరిగి వెళ్లినట్టు కృష్ణారావు తెలిపారు.
