వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గపోరు
ఒకవైపు ఎమ్మెల్సీ, డీసీసీ కూటమి.. మరోవైపు మంత్రి వర్గం
మధ్యలో నలుగుతున్న కార్యకర్తలు
ఆధిపత్య పోరుతో రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు
కార్పొరేషన్ ఎన్నికల వేళ ఏ వర్గాన్ని నమ్మాలో తెలియక శ్రేణుల అయోమయం
‘పార్టీలో డీసీసీలకే ప్రాధాన్యం’ అన్న ఏఐసీసీ ఇన్‌చార్జి
మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలతో రాజుకున్న కొత్త సెగ
టికెట్ల కేటాయింపులో ఏ వర్గం హవా నడుస్తుందోనని ఆశావహుల్లో సందిగ్ధం
వర్గపోరుకు బ్రేక్ వేయకుంటే భారీ నష్టం తప్పదని ఆందోళన
వేద న్యూస్, ఎల్.కే (ప్రత్యేక ప్రతినిధి):
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ గుంభనంగా సాగిన ఆధిపత్య పోరు.. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండడంతో పూర్తిగా రచ్చకెక్కింది. నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు ఉన్న నేతలు ఒకవైపు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి వర్గం మరోవైపు చేరి సొంత పార్టీలోనే సమాంతర రాజకీయాన్ని నడుపుతుండటం గమనార్హం. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు ఏ వర్గంతో సఖ్యతగా ఉండాలో తెలియక అయోమయంలో ఉంటున్నారు.
డీసీసీ, ఎమ్మెల్సీ ఒకవైపు.. మంత్రి మరోవైపు
వరంగల్ తూర్పులో రెండు వర్గాలు కాంగ్రెస్ విడిపోయింది. ఒకవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయూబ్ తో పాటు స్థానిక ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు అనుకూలంగా ఉన్న బలమైన వర్గం, మరోవైపు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ వర్గం వేర్వేరుగా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారనే అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సైతం పలు వివాదాలు ఇరు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఒకే పార్టీలోని రెండు వర్గాల తీరుతో ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక తీవ్రంగా నలిగిపోతున్నారు.
మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలతో మారిన సీన్..
ఇలాంటి వాతావరణంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో సరికొత్త చిచ్చు రేపాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలలోను, నిర్ణయాలలోను ఎవరి సిఫార్సులతో సంబంధం లేకుండా కేవలం డీసీసీలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది అనే భావన వచ్చేలా ఆమె మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం పెద్దల నుండి వచ్చిన ఈ సంకేతాలతో డీసీసీ, ఎమ్మెల్సీ వర్గం ఫుల్ జోష్‌లోకి రాగా.. మంత్రి వర్గం దీనిని ఎలా కౌంటర్ చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యాఖ్యల తర్వాత నియోజకవర్గంలో గ్రూపుల రాజకీయం మరింత ఊపందుకుంది.
కార్పొరేషన్ టికెట్ల గుబులు..
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్లు కావాలని ఆశపడుతున్న ఆశావహుల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. టికెట్ కావాలంటే ఏ వర్గానికి దగ్గరగా ఉండాలి? రేపు ఏ గ్రూపునకు హైకమాండ్ బి ఫామ్ ఇస్తుంది? అనే సందిగ్ధంలో లీడర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక వర్గానికి దగ్గరైతే.. మరో వర్గం ఎక్కడ రాజకీయంగా తొక్కుతుందోనని భయపడుతున్నారు.
గ్రూపు తగాదాలకు చెక్ పెట్టకపోతే..
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో రాజుకున్న ఈ అంతర్గత వర్గ విభేదాలకు అధిష్ఠానం గనుక త్వరగా తెరదించకపోతే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలు ఇలాగే ముదిరితే, ప్రత్యర్థి పార్టీలకు అది కలిసివచ్చే అంశంగా మారి, హస్తం పార్టీకి భారీ రాజకీయ నష్టం వాటిల్లడం ఖాయమని సొంత పార్టీ సీనియర్ నాయకులే ఇప్పుడు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యానికి ఈ ఆధిపత్య పోరు పెద్ద గండంగా మారకముందే పీసీసీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి’
‘కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి’ అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి. ఒకవైపు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై చర్చ సాగుతుండగా, మరోవైపు కొండ మురళి ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ ను ఉద్దేశించి చిన్నపులి అంటూ మంత్రి చేసిన కామెంట్స్, అతని రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు నడుస్తున్నాయి. అయితే ఇదే అంశం పార్టీలోని కొందరు సీనియర్ నేతల అసంతృప్తికి కారణమైందనే చర్చ కూడా చాలాకాలంగా ఉంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన నేతలను పక్కనబెట్టి, కీలక నిర్ణయాలు నవీన్ రాజ్ ద్వారా జరుగుతున్నాయనే అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నట్టు ప్రచారంలో ఉంది. తూర్పు నియోజకవర్గ పార్టీ వ్యవహారాలన్నీ కొండ అనుచరుడి చుట్టూనే తిరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో అతని పేరు పలు వివాదాల్లోనూ వినిపించగా.. భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఆయనకు ప్రభుత్వం కల్పించిన ఇద్దరు గన్మెన్లను పోలీసు శాఖ కూడా ఉపసంహరించుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యేగా గెలిచాక సురేఖకు మంత్రి పదవి దక్కడంతో బిజీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తల బాగోగులను చూసుకుంటూ నవీన్ రాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలు, నేతలతో సమన్వయం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో చురుగ్గా ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. దీంతో కొండా దంపతుల తర్వాత నవీన్ రాజ్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారనే వ్యక్తమవుతోంది.
