- షాద్‌నగర్ టూబీహెచ్‌కే హౌజెస్ కథ గింతేనా ఇగ?
- సోలిపూర్ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు
- నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు
- అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు
- మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే
- మళ్లీ మొదటికి వచ్చిన ‘డబుల్’ ఇండ్ల పంపిణీ కథ..!
వేద న్యూస్, షాద్ నగర్:
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చెత్తమయంగా మారాయి.! అవునండీ.. మీరు చదివింది నిజమే.. ‘డబుల్’ ఇండ్ల పరిసరాలు కంపు కొడుతున్నాయి. నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా కనీసంగా పట్టింపు లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారాయి. సోలిపూర్ వద్ద నిర్మించిన ఇండ్ల దుస్థితి ఇది..
గత ప్రభుత్వం చేపట్టిన ‘డబుల్’ ఇండ్ల పథకంలో షాద్ నగర్ నియోజకవర్గానికి 1,720 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,300కు పైగా ఇండ్లు పట్టణ శివారులోని ప్రశాంత్ నగర్ కాలనీ శివారులో ఉన్నాయి. రూ.85.68 కోట్ల అంచనాలతో 2018లో నిర్మించే తలపెట్టిన ఈ ఇండ్లను 2021 నాటికే పూర్తి చేశారు. అయితే గత ప్రభుత్వం ఈ ఇండ్లను పంచకుండా జాప్యం చేసింది.
2023 ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చిన నాటి మంత్రి కేటీఆర్ నామమాత్రంగా ఓ పదిమందికి మాత్రం ఇంటి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇండ్ల పంపిణీ కథ అక్కడే ఆగింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకు ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జిల్లా కలెక్టర్ ను పిలిపించి ఇండ్లను పరిశీలించి తాగునీరు, రహదారులు, పగిలిపోయిన తలుపులు, కిటికీల మరమ్మత్తు నిమిత్తం రూ. 7కోట్లు మంజూరు చేయించారు. కాగా, గతంలో కాంట్రాక్టర్లకు బాకీ పడ్డ డబ్బులు గత ప్రభుత్వ హయాంలో చెల్లించకపోవడంతో వచ్చిన నిధులన్నీ బాకీల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.
చెత్తాచెదారం @‘డబుల్’ ఇండ్లు
‘డబుల్’ ఇండ్లు అంటే నివాసయోగ్యమైన ఇండ్లలా కాకుండా చెత్తాచెదారం గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉండే ప్రదేశాలుగా మారిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సోలిపూర్ శివారులో కట్టిన ఇండ్లను చూస్తే మీకు ఈ విషయం స్పష్టమౌతుంది. మున్సిపాలిటీ నగర చెత్త మొత్తం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పారబోస్తుండడంతో పరిస్థితులు ఘోరంగా మారాయి.

ఇళ్లలో కూడా చెత్తాచెదారం నింపారు. సోలిపూర్ గ్రామస్తులు ఈ చెత్తాచెదారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రభుత్వంలోనైనా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి.. ఇండ్ల వద్ద చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని, ‘డబుల్’ ఇండ్లు పూర్తిగా నిర్మాణం చేయించి లబ్ధిదారులకు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.