Oplus_16777216

 

  •  మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు
  •  సుమారుగా 10 కుటుంబాలకు నీళ్ల కరువు
  •  మంచినీళ్లు సరఫరా చేయాలని వేడుకోలు

వేద న్యూస్, కమలాపూర్ : 

 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో సుమారుగా 10 కుటుంబాలకు మిషన్ భగీరథ నీళ్ళు రాక ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుగుపొరుగు వారి ఇంటి నల్లా వద్దకు వెళ్లి నీళ్లు మోసుకుంటూ వచ్చి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు.

స్థానిక మాజీ ప్రజాప్రతినిధులకు, సంబంధిత సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించిన అధికారులతో మాట్లాడి అప్పుడు చేపిస్తాం ఇప్పుడు చేపిస్తాం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

సమస్య గురించి చెప్పినప్పుడల్లా దాటవేసే ధోరణితో వ్యవహరించారని, కానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు కూలి పని చేసుకుని జీవనం కొనసాగించే ఓ మహిళ అయితే మాత్రం మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రతిరోజు ఇరుగుపొరుగు వారి నల్లా వద్దకు వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకుంటూ తమ గోళాన్ని నింపుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు.

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం ప్రతి ఇంటికి మంచినీళ్లు సరఫరా చేయాలనే సదుద్దేశంతో చేపట్టిన కొన్ని కుటుంబాలకు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు.

అధికారులు స్పందించి తమ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామపంచాయతీ సిబ్బంది ఇలాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది.

క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఇలాంటి సమస్యలను పై అధికారులకు చేరవేస్తున్నారా? లేక చేరవేసిన కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారా? అనేది అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా ప్రజల నీటి కష్టాలను తీర్చాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఎంతైనా ఉంది.