= గెలుపోటములను శాసించే సోషల్ మీడియా
= సామాజిక మాధ్యమాల పవర్ గ్రహించిన ప్రధాన పార్టీలు
= ప్రజాభిప్రాయాన్ని మార్చడంలో కీలక పాత్ర
= ఇప్పటి నుంచే బలోపేతం చేస్తూ వ్యూహాలు
= వ్యూహకర్తలకు భారీ ఆఫర్లు..
= వినూత్న ప్రచారాలు, కౌంటర్ అటాక్‌ల కోసం పక్కా ప్లాన్
= యువతను ఆకట్టుకోవడంలో సోషల్ మీడియానే మంత్రం
= సంప్రదాయ ప్రచారానికి తోడుగా సోషల్ వార్
వేద న్యూస్, పొలిటికల్ బ్యూరో :
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు డిజిటల్ వార్ మొదలైంది. క్షేత్రస్థాయిలో సంప్రదాయ ప్రచారాలైన సభలు, రోడ్ షోలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ, రాబోయే ఎన్నికల గెలుపోటములను శాసించే అసలైన యుద్ధం మాత్రం ఈసారి ‘డిజిటల్ స్క్రీన్ల’ పైనే జరగబోతోంది. ఓటర్లతో నేరుగా సంప్రదింపులు జరపడానికి, ప్రచారాలను క్షణాల్లో వేగవంతం చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ డిజిటల్ పవర్ ఏంటో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా గ్రహించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారాలే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారంటే.. ఈ నెట్‌వర్క్ ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాపై పార్టీల దృష్టి
వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లతో పాటు.. ఇటీవల ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో సరికొత్తగా రంగంలోకి దిగిన కల్వకుంట్ల కవిత సైతం ఇప్పటి నుంచే తమ సోషల్ మీడియా వింగ్స్‌ను సమూలంగా బలోపేతం చేసుకుంటున్నాయి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పేరున్న సోషల్ మీడియా స్ట్రాటజిస్టులను సైతం రంగంలోకి దంచుతూ వినూత్న ప్రచారానికి తెరలేపుతున్నాయి.
యువతే కీలకం
నేటి సమాజంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లే ఎన్నికల్లో కీలకం. వీరంతా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌లోనే గడుపుతున్నారు. ఈ సగటు యువ ఓటర్ల మనస్తత్వాన్ని అంచనా వేసి, వారి శైలిలోనే ఆకట్టుకునేలా పొలిటికల్ మీమ్స్, షార్ట్ వీడియోల ద్వారా పార్టీలు మమేకం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఆధునిక రాజకీయాల తరహాలోనే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న మొత్తాల్లో ఎన్నికల నిధులను సేకరించే ట్రెండ్ ఊపందుకుంది. ఇది పార్టీలకు ఆర్థిక బలంతో పాటు ప్రజల్లో ఓనర్‌షిప్ భావాన్ని పెంచుతుంది.
పలు స్ట్రాటజీలతో జనాల్లోకి..
రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ప్రత్యర్థులు వేసే విమర్శనాత్మక అస్త్రానికి గంటల వ్యవధిలోనే పక్కా ఆధారాలు, పాత వీడియో క్లిప్పింగ్‌లతో కౌంటర్లు ఇవ్వడం, స్పష్టతనివ్వడం ఇప్పుడు అనివార్యమైంది. ఎవరు ఎంత వేగంగా సోషల్ మీడియాలో రెస్పాండ్ కాగలిగితే.. న్యూట్రల్ ఓటర్లలో అంత పాజిటివ్ మైలేజ్ వస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే ఏజెన్సీలతో పాటు, సోషల్ మీడియా వేదికలపై నిర్వహించే డిజిటల్ పోల్స్ ద్వారా ప్రజామోదాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పౌరుల అసంతృప్తి ఏ అంశాలపై ఉందో తెలుసుకుని వ్యూహాలను మార్చుకుంటున్నారు.
సోషల్ మీడియా ప్రచారానికి కోట్ల ఖర్చు..
ఈ డిజిటల్ యుగంలో కేవలం జెండాలు, ఫ్లెక్సీలు, మైక్ సెట్లతోనే ఎన్నికల ప్రచారం ముగిసిపోవడం లేదు. ఓటర్ల మైండ్‌సెట్‌ను మార్చడంలో సోషల్ మీడియానే అత్యంత కీలకమైన అస్త్రం కావడంతో.. ప్రధాన పార్టీలన్నీ డిజిటల్ ప్రచారం కోసం కోట్ల రూపాయల బడ్జెట్‌ను కుమ్మరిస్తున్నాయి. కేవలం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వేదికలపై అధికారిక యాడ్స్ ఇవ్వడానికే కాకుండా.. తెరవెనుక వందలాది మందితో నడిచే హైటెక్ వార్ రూముల నిర్వహణకు, పేరుమోసిన పొలిటికల్ స్ట్రాటజిస్టులకు కోట్లాది రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిరంతరం రీల్స్, షార్ట్స్, మీమ్స్ క్రియేట్ చేసే ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రైటర్లను పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చి మరీ నియమించుకుంటున్నాయి. ప్రతి ఓటరు చేతిలోని స్మార్ట్‌ఫోనే లక్ష్యంగా సాగుతున్న ఈ డిజిటల్ గెరిల్లా వార్‌లో గెలవడం కోసం, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నెలకు కోట్ల రూపాయల నిధులను నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రధాన పార్టీలు తమ సోషల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయి.
నాలుగు పార్టీల భిన్న వ్యూహాలు
రాబోయే ఎన్నికలు తెలంగాణలోని నాలుగు ప్రధాన శక్తులకు జీవన్మరణ సమస్యగా మారాయి. అందుకే సంప్రదాయ ప్రచార శైలిని కొనసాగిస్తూనే, తెరవెనుక సోషల్ మీడియా వార్ రూములను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, ‘ఆరు గ్యారంటీలు’ క్షేత్రస్థాయికి ఎలా చేరుతున్నాయో లబ్ధిదారుల వీడియోల ద్వారా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ దూకుడు ప్రసంగాలను రీల్స్ రూపంలో వైరల్ చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టేందుకు పెద్ద ఎత్తున డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దించింది. జాతీయ స్థాయిలో సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీది ప్రత్యేక శైలి. ఢిల్లీ పెద్దల పక్కా వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయవాదం వంటి అంశాలను ఇక్కడి లోకల్ సెంటిమెంట్‌కు ముడిపెడుతూ సరికొత్త పొలిటికల్ గెరిల్లా వార్ నడుపుతోంది. మైక్రో-లెవెల్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి ఓటరును టార్గెట్ చేస్తోంది. గత ఎన్నికల ఓటమి నేర్పిన పాఠాలతో ఈసారి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ అత్యంత పదునైన వ్యూహాలతో పనిచేస్తోంది. కేటీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నిరుద్యోగ సమస్యలు, నెరవేరని హామీలను ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్, మీమ్స్ రూపంలో జనంలోకి తీసుకెళ్తూ డిజిటల్ స్పేస్‌లో దూసుకుపోతోంది. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి, ప్రజల్లోకి ‘పాంచజన్యం’ హామీలను, సరికొత్త అజెండాను వేగంగా తీసుకెళ్లడానికి కల్వకుంట్ల కవిత సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు.