= జమ్మికుంట మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాయాజాలం
= జీతాల పెంపు పేరిట భారీగా వసూళ్లు?
= సీనియార్టీ పక్కనపెట్టి జీతాల పెంపు ఇచ్చారనే విమర్శలు
= అధికారులు, పాలకవర్గం వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటో?
= తోటి ఉద్యోగుల శ్రమ దోపిడీ.. ఎవరి వాటా ఎంతనో తేల్చేదెవరో?
= సదరు వ్యక్తి జమ్మికుంట మున్సిపల్‌లో అంత ‘పవర్’ ఫులా?
= జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ఉద్యోగుల డిమాండ్


వేద న్యూస్, జమ్మికుంట
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మున్సిపల్‌లో అసలేం జరుగుతోంది? అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల వద్ద జీతం పెంపు పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. అతనిదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు ఉద్యోగి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని, అయినప్పటికీ అధికారులు, పాలకవర్గం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వార్డు కౌన్సిలర్ ఈ వ్యవహారంపై ఆరా తీయగా, బాధిత ఉద్యోగులు తమకు జరిగిన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. జీతాల పెంపు కోసం సుమారు 8 మంది డ్రైవర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.80 వేల చొప్పున, మరో ఇద్దరు డ్రైవర్ల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే సీనియార్టీ ప్రకారం జీతం పెంపునకు అర్హులైన ఇద్దరు ఉద్యోగులు తక్కువ మొత్తం చెల్లించడంతో వారిని పక్కనపెట్టి, ఎక్కువ మొత్తాలు ఇచ్చిన ఇతరులకు వేతనాల పెంపు మంజూరు చేసినట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో తాము అన్యాయానికి గురయ్యామని వారు వాపోతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులను ప్రశ్నించగా, సీనియార్టీ, డ్రైవింగ్ లైసెన్సుల ఆధారంగానే వేతనాల పెంపు ఇచ్చినట్టు పేర్కొన్నారని సమాచారం. అయితే ఉద్యోగుల నుంచి బహిరంగంగానే డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ, జిల్లా స్థాయి అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరికైనా చెప్పుకో.. నేనింతే అన్నట్టుగా సదరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వ్యవహరిస్తున్నాడని, అతనికి వ్యవస్థలో బలమైన పలుకుబడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా 8 మంది నుంచి రూ.6 లక్షల 40 వేలు, మరో ఇద్దరి నుంచి రూ.1 లక్ష వసూలు చేసినట్టు ఆరోపణలు ఉండగా, మొత్తం రూ.7 లక్షల 40 వేల వ్యవహారంలో ఎవరి వాటా ఎంత అన్నది తేలాల్సి ఉంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని మున్సిపల్ ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *