= 20ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రుల మౌన రోదన
= విషప్రయోగం అని ఫోరెన్సిక్ రిపోర్టు
= ‘న్యాచురల్ డెత్’గా మార్చేసిన పోలీసులు
= ఆధారాలున్నా నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన
= హెచ్‌ఆర్‌సీ యాక్షన్ తీసుకోమన్నా పట్టింపులేని ఖాకీలు
= అప్పటి వరంగల్ సీపీ రీఓపెన్ చేసినా కదలని కేసు
= చివరకు కొత్త డీజీపీ సర్ కు బాధితుల వేడుకోలు
= సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్

వేద న్యూస్, ఫోకస్ టీమ్
శాంతిభద్రతల పరిరక్షణే కాదు, బాధితులకు అండగా నిలవాల్సిన రక్షక భటులే అడ్డదారులు తొక్కుతూ బాధితులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రమాదం జరిగినా, అన్యాయం జరిగినా ప్రజలు ఆశగా పోలీస్‌ స్టేషన్‌కే పరిగెడతారు. కానీ, న్యాయం చేయాల్సిన అధికారులే నిందితులకు కొమ్ముకాస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 09 మే 2018 నాడు భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం-లక్ష్మి దంపతుల కుమారుడు ఆషాడపు రాజేష్ (20) మిత్రుడి పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు అకాల మరణం వెనుక అనుమానాలు ఉన్నాయంటూ తండ్రి దశరథం స్థానిక వంగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమికంగా పోస్టుమార్టం నిర్వహించి, మృతుడి స్నేహితులైన తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం వచ్చిన ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్) ల్యాబ్ నివేదికలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. రాజేష్ తాగిన బీరులో విషం ఉన్నట్లు, అది విషప్రయోగం వల్ల జరిగిన హత్యేనని ఫోరెన్సిక్ నివేదికలు తేల్చిచెప్పాయి. అయితే, ఇంత బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకుండా తీవ్ర ఉదాసీనత ప్రదర్శించారని మృతుడి తండ్రి దశరథం ఆరోపిస్తున్నారు. కొడుకును కోల్పోయిన ఆ కన్నతల్లిదండ్రులు న్యాయం కోసం ఎక్కని మెట్లు, తిరగని ఆఫీసులు లేవు. ఈ సుదీర్ఘ పోరాటంలో న్యాయం దక్కకపోగా, వారిపై భారీగా ఆర్థిక భారం పడింది.

అప్పటి సీపీ ఫైల్ రీఓపెన్ చేసినా..
మధ్యలో 2023లో వరంగల్ సీపీగా ఉన్న రంగనాథ్ స్పందించి ఈ ఫైల్‌ను రీఓపెన్ చేయించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రగతి కనిపించలేదు. మానవ హక్కుల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, ప్రజావాణిలో పదే పదే మొరపెట్టుకున్నా బాధితులకు చుక్కెదురే అయింది. దానికి పరాకాష్టగా, గత ఏప్రిల్ 8న వంగర ఎస్ హెచ్ఓ నుంచి బాధితులకు ఒక పోస్ట్ అందింది. అందులో రాజేష్ ది ‘న్యాచురల్ డెత్’ అని పేర్కొనడంతో ఆ తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు విషప్రయోగం అని చెప్తుంటే, పోలీసులు దాన్ని సహజ మరణంగా ఎలా కొట్టేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

డీజీపీ సర్ మీరే దిక్కు..
ఈ క్రమంలోనే, తమకు జరిగిన ఘోర అన్యాయాన్ని వివరిస్తూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్‌కు బాధితులు ఇటీవల ఒక దీనమైన వినతి పత్రం సమర్పించారు. ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో లేదా ఉన్నత స్థాయి అధికారులతో లోతైన విచారణ జరిపించి, నిందితులను శిక్షించాలని, అలాగే కేసును పక్కదారి పట్టించిన పోలీసు అధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని వారు వేడుకుంటున్నారు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం అల్లాడుతున్న ఆ దంపతుల ఆఖరి ఆశ ఇప్పుడు డీజీపీ సర్ పైనే ఉంది. అసలు రాజేష్ ది పోలీసులు చెబుతున్నట్లు సహజ మరణమా? లేక ఫోరెన్సిక్ రిపోర్టు చెప్తున్నట్లు విషప్రయోగ హత్యనా? అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీస్ ఉన్నతాధికారులపై ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *