= 3లక్షలకు పైగా ఫిర్యాదుల
= డిజిటల్ విప్లవం.. నేరగాళ్లకు వరం
= చదువుకున్న వారు, ఉన్నతోద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీసే బాధితులు
= ప్రజా ప్రతినిధులు సైతం కేటుగాళ్ల వలకి..
= విన్యూత్న వ్యూహాలతో బురిడీ
= జీవితకాల సంపాదన క్షణాల్లో మాయం
= సైబర్ నేరాలపై అవగాహన అవసరం అంటున్న నిపుణులు
= అపరిచిత లింకులు, ఆఫర్లతో జాగ్రత్త అంటూ పోలీసుల హెచ్చరిక
= సైబర్ క్రైం జరిగితే గోల్డెన్ అవర్స్ చాలా కీలకం
వేద న్యూస్, క్రైం బ్యూరో:
ప్రపంచం అంతా డిజిటల్ మయం అయిపోయింది. తెలంగాణలో డిజిటల్ కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగింది. పల్లె నుంచి పట్నం వరకు చిన్న కరివేపాకు కట్ట కొన్నా డిజిటల్ పేమెంట్ చేసే స్థాయికి మనం చేరుకున్నాం. అయితే, ఇదే సాంకేతికత సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ వాడుతున్న సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేరగాళ్ల డేంజర్ జోన్లో ఉన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, మెయిల్స్ ద్వారా వచ్చే ఒక చిన్న అపరిచిత లింక్, మీ జీవితకాల సంపాదనను క్షణాల్లో మాయం చేస్తోంది.
మూడేళ్లలో మూడు లక్షల ఫిర్యాదులు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించిన గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 2022 నుంచి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా సైబర్ ఫిర్యాదులు అందగా, అందులో 76,048 కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో నేరగాళ్లు ప్రజల నుంచి సుమారు రూ. 4,724 కోట్లు దోచుకోవడం గమనార్హం. కేవలం నిరక్షరాస్యులే కాదు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, చివరికి ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యేలు) సైతం ఈ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు.
వినూత్న వ్యూహాలు
రాష్ట్రంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో అత్యధికం పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కేసుల సంఖ్య భారీగా ఉంది. నేరగాళ్లు కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాకుండా, న్యూడ్ వీడియో కాల్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడుతూ బ్లాక్ మెయిల్ చేయడానికీ వెనుకాడటం లేదు. గౌరవ మర్యాదలకు భయపడి చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం నేరగాళ్లకు మరింత కలిసొస్తోంది.
ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో..
పండుగలు లేదా ప్రత్యేక రోజులను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్, ఉచిత రీఛార్జ్, భారీ డిస్కౌంట్ అంటూ పంపే లింకులు క్లిక్ చేయగానే ఫోన్‌లోకి మాల్వేర్ ప్రవేశిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం డీప్‌ఫేక్ టెక్నాలజీతో ప్రముఖుల ముఖాలను వాడి నకిలీ వీడియోలను సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం కూడా నేరమేనని, గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకింగ్ మోసాలు.. కేవైసీ పేరిట వంచన
మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది లేదా కేవైసీ అప్‌డేట్ చేయాలి అంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌లతో ప్రజలను భయపెట్టడం నేరగాళ్ల ప్రధాన ఆయుధం. ఈ క్రమంలో వారు అడిగే ఓటీపీ లేదా పిన్ నంబర్లను చెబితే ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. బ్యాంకులు ఎప్పుడూ ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడగవనే ప్రాథమిక విషయాన్ని ప్రజలు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ లింక్ క్లిక్ చేయకపోయినా అకౌంట్లో డబ్బు మాయమవుతోందన్న ఫిర్యాదులు కూడా అందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల హెచ్చరిక.. గోల్డెన్ అవర్స్ కీలకం
సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిరంతరం కొనసాగుతున్నాయి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. నేరం జరిగిన మొదటి రెండు గంటలు (గోల్డెన్ అవర్స్) చాలా కీలకమని, ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును వెనక్కి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
