- జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి
వేద న్యూస్ , జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని గణేష్ నగర్ కు చెందిన హరీష్ కావ్య దంపతులు గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా, వారికి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ గైనకాలజిస్ట్ సూచన మేరకు ఫార్మసిస్టు వారికి ఇవ్వ,గా అవి కాలం చెల్లిన టాబ్లెట్లుగా హరీష్ గుర్తించి ఆదివారం ఆసుపత్రి ప్రాంగణముకి వచ్చి సిబ్బందికి తెలిపారని, ఇలాంటి టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల రోగి ప్రాణాలకు అలాగే ఆమె కడుపులో ఉన్న పాప ప్రాణాలకు అపాయం జరిగితే ఎవరూ బాధ్యులని నిలదీసినట్లు తెలిపారు.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో తాను అందుబాటులో లేనని, చొప్పదండిలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరంలో పాల్గొన్నానని వెల్లడించారు. దీనిపై సోమవారం ఆస్పత్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే బాధితులను ఫార్మసిస్టులను పిలిపించి, ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ టాబ్లెట్స్ జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రి లో లేవని, ఈ బ్యాచ్ కి సంబంధించిన టాబ్లెట్స్ మా దగ్గర లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ బాధితులు ఆస్పత్రి సిబ్బంది ఇచ్చారని చెప్పగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే శాఖపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రోగులను కాపాడాల్సిన బాధ్యత ఆసుపత్రి డాక్టర్లతో పాటు సిబ్బంది కి కూడా ఉండాలని, రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
ఇక్కడ జరిగిన విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపించి, ఒకవేళ పొరపాటు జరిగితే ఖచ్చితంగా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు..:బాధితుడు తాళ్లపల్లి గణేష్
మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో తన భార్య అస్వస్థతకు గురైందని, దీనిపై ఆసుపత్రి సూపర్డెంట్ కు ఫిర్యాదు చేయగా విచారణ చేసి న్యాయం చేస్తానని తెలిపారని గణేష్ పేర్కొన్నారు.
తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని, ఈ రోజుల్లో ఎంతో మంది దంపతులు పిల్లలు లేక తల్లడిల్లి పోతున్నారని అలాంటిది గర్భిణులు ఆసుపత్రికి వస్తే.. ఇలా కాలం చెల్లిన మందులు ఇవ్వడం వల్ల కుటుంబాలు నష్టపోతాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని గణేష్ పేర్కొన్నారు.