వేద న్యూస్, ఇల్లంతకుంట:
ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేక అధికారి రమణారావు మంగళవారం ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలని సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డీఐఈఓ శ్రీనివాస్ ఉన్నారు. వారు తరగతులను సందర్శించి, బోధన విధానాలపై సమీక్ష చేపట్టారు. విద్యార్థుల హాజరు, అకడమిక్ రికార్డుల నిర్వహణ, డిజిటల్ తరగతుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు.
తరగతుల్లో బోధన పద్ధతులను నేరుగా గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ప్రత్యేక అధికారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ, చదువుపై దృష్టి కేంద్రీకరించాలనీ, ప్రభుత్వ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనీ సూచించారు.
క్రమశిక్షణతో మెలిగి, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని కోరారు. విద్యే జీవితాన్ని మారుస్తుందని, అందుకే ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజం కృషిని ప్రత్యేక అధికారి అభినందించారు.విద్యార్థుల ప్రగతికి ఆయన తీసుకుంటున్న చర్యలు, కళాశాల పరిపాలనలో చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు.
అధ్యాపకుల బోధనను నేరుగా పరిశీలించిన అధికారులు, సాంకేతికతో కూడిన బోధన చేయాలని సూచించారు. విద్యార్థులలో విజ్ఞానం, నైతికత, సామాజిక విలువలను పెంపొందిస్తూ, వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న అధ్యాపక సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.కార్యక్రమం లో అధ్యాపకులు నయీమొద్దిన్, సతీష్ రెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.