వేద న్యూస్, మరిపెడ:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి సత్తా  చాటుతుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ గా పనిచేసిందని ఆరోపించారు.

పీసీ ఘోష్ కాంగ్రెస్ కార్యకర్తలాగ పనిచేసి.. కాంగ్రెస్ లీడర్లు మాట్లాడిన విషయాలనే రిపోర్టులో పొందుపరిచారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆధ్వర్యంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నీరు గార్చి లక్ష ఎకరాలను ఎండ బట్టే కుట్రకు తెర లేపారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలు సర్కారు ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలో కి వచ్చి బీసీలను మభ్య పెట్టే విధంగా హస్తం పార్టీ ఢిల్లీలో  ధర్నా లు అంటూ నాటకాలు చేస్తున్నదని విమర్శించారు.

గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ లకు డీజిల్ లేక కలెక్టర్ లు స్వాధీన పరుచుకొని దుస్థితికి తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రతి పనికి 10శాతం కమీషన్ వసూళ్లు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.