- యాజమాన్య సహకారంతో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించిన జిడబ్లుఎసి
సంస్థ
వేద న్యూస్, చొప్పదండి:
సౌదీ అరేబియాలో జీవనోపాధి కోసం వలస వెళ్లిన మరో తెలంగాణ కార్మికుడు గుండెపోటుతో మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన అలుకపల్లి అంజయ్య (60), తండ్రి పేరు నర్సయ్య, గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో కూలీగా పని చేస్తున్నారు. జూలై 24, 2025 గురువారం నాడు రోజువారీ పనిలో పాల్గొన్న అంజయ్య, అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చిన అనంతరం కుప్పకూలిపోయారు. వెంటనే తోటి కార్మికులు ప్రథమ చికిత్స అందించి సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్సకు ముందే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనను ఆయన ఉద్యోగ యజమాని వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసిన తరువాత, జిడబ్లుఎసి (గల్ఫ్ వర్కర్స్ అవేర్‌నెస్ సెంటర్) సంస్థ అధ్యక్షుడు అబ్దుల్ రఫిక్ కి సమాచారం అందించబడింది.
వెంటనే స్పందించిన జిడబ్లుఎసి సభ్యులు– జడి మల్లయ్య, మహమ్మద్ ఫారూక్, జవ్వాజి మల్లేశం, మహబూబ్ నగర్ శంకర్ సహకారం తో మృతదేహం తరలింపు కోసం అవసరమైన అన్ని పత్రపూరణా ప్రక్రియలు పూర్తి చేసి, ఆగస్టు 14, 2025 న మృతదేహాన్ని స్వదేశానికి పంపించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి మృతుడి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయాలని జిడబ్లుఎసి సభ్యుడు మహమ్మద్ ఫారూక్, తెలంగాణ రాష్ట్ర ఎన్ ఆర్ ఐ సెల్ అధికారి చిట్టి బాబు సార్ ని అభ్యర్థించారు. దీనికి సానుకూలంగా స్పందించిన చిట్టి బాబు వెంటనే అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అంత్యక్రియలు చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో నిర్వహించబడనున్నాయి. ఈ ప్రక్రియలో జెద్ద కౌన్సిలేట్, సౌదీ కఫీల్, ఇతర అధికారులు అందించిన సహకారానికి జిడబ్లుఎసి సౌదీ అరేబియా శాఖ తరఫున అధ్యక్షుడు అబ్దుల్ రఫిక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కనీసం రూ. 5 లక్షల సహాయం అందించాలని, అన్ని విధాలుగా ప్రభుత్వం మద్దతుగా నిలవాలంటూ జిడబ్లుఎసి సంస్థ విజ్ఞప్తి చేసింది.