• యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఛేదన సమయంలో..
  • ప్రొబేషనరీ పీరియడ్‌లోనే ఆరుగురిని రక్షించిన పోలీస్ ఆఫీసర్
  • వరంగల్ ట్రాఫిక్ తొలి మాహిళా సారథి కోడూరి సుజాత
  • అనతి కాలంలోనే ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగిన ఆఫీసర్
  • ప్రజలకు సేవ చేయడంలోనూ ముందున్న అధికారిణి
  •  ‘వేద న్యూస్’ కు ట్రాఫిక్ అధికారిణి ప్రత్యేక ఇంటర్వ్యూవేద న్యూస్, వరంగల్ క్రైమ్ :

సింగరేణి ప్రాంతం నుంచి వచ్చిన వారు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారనే నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు వరంగల్ ట్రాఫిక్ సీఐ కోడూరి సుజాత. శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు కృషి చేస్తూ.. నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా ఆమె చక్కటి పేరు సంపాదించుకున్నారు. ఖాకీగా తన విధులను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తున్నారని చెప్పడానికి నిదర్శనం.. ప్రొబేషనరీ పీరియడ్‌లోనే ఆమె సుమారు 5 నుంచి ఆరుగురిని హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఛేదన సమయంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ పరిధిలో ఓ రైల్వే స్టేషన్‌లో రెస్క్యూ చేసి కాపాడటం. 2009 బ్యాచ్‌గా ఎస్ఐగా రిక్రూట్ అయిన ఆమె అనతి కాలంలోనే పోలీస్ శాఖలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. వరంగల్ ట్రాఫిక్ తొలి మహిళా సారథిగా(సీఐ)గా ఇటీవల ఆమె బాధ్యతలు స్వీకరించారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ శాఖలో రాణిస్తున్న ఇన్‌స్పెక్టర్ సుజాత ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ప్రతినిధి వివేక్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

 

ప్రతినిధి : మీ తల్లిదండ్రులు, బాల్యం గురించి చెప్పండి?

సీఐ : నా తల్లిదండ్రులు పెద్దపల్లి జిల్లా గోదావరిఖినికి చెందిన సింగరేణి ఉద్యోగి కోడూరి రాగయ్య -సుగుణ. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న నా సోదరుడిని ఆదర్శంగా తీసుకుని ఖాకీ వృత్తిలోకి వచ్చా. సమాజ సేవలో నా వంతుగా సేవలందించాలనుకున్నా. అందులో భాగంగానే పోలీస్ అధికారిగా ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తూ.. ముందుకు సాగుతున్నా.

ప్రతినిధి : మీరు ఏయే పీఎస్‌లలో పని చేశారు?

సీఐ : ప్రొబేషనరీ పీరియడ్‌ మడికొండ పీఎస్‌లో పూర్తి చేశా. అనంతరం ఉమెన్ పీఎస్, ఇంతేజార్‌గంజ్, కాజీపేట స్టేషన్లలో వర్క్ చేశా. అనంతరం షీ టీంలోనూ పని చేశాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే తొలి పోస్టింగ్ సంపాదించాను. షీటీంలో పని చేస్తున్న క్రమంలో మహిళల రక్షణ విషయమై బాధ్యతగా వ్యవహరించాను. ప్రస్తుతం వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నాను. సదరు పోస్టు పొందిన తొలి మహిళా అధికారిణి నేనే కావడం పట్ల సంతోషిస్తున్నా.

 

 

ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మీరు ఏం చేయబోతున్నారు?

సీఐ : ట్రాఫిక్ విషయమై ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించేలా త్వరలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నా. ప్రస్తుతమున్న రోడ్ల మరింతగా వెడల్పు చేయడంతో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణాల ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భవనాలకు అనుమతులిచ్చే క్రమంలో అధికారులు పార్కింగ్‌ విషయమై సూచించాలి. పార్కింగ్ విషయమై బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టైంలోనే గుర్తు చేసినట్టయితే ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ముందే నివారించే అవకాశాలుంటాయి. రోడ్డుపైకి వాహనాలను తీసుకొచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.

 

ప్రతినిధి : మీకు ఖాకీ వృత్తిలో ఇప్పటివరకు సంతృప్తినిచ్చిన సంఘటనలున్నాయా?

సీఐ : మడికొండ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ప్రొబేషనరీ ఖాకీగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఛేదనలో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్లాను. అక్కడ ఆ కేసు సాల్వ్ కాలేదని పోలీసులు వెనుదిరిగి వస్తున్న క్రమంలో.. నేను సమీపంలోని రైల్వే స్టేషన్‌లో 5 నుంచి ఆరుగురిని గుర్తించి వారి ప్రాణాలు కాపాడాను. వారిని రక్షించినందుకు నేను గర్విస్తున్నా. ఆ సంఘటన నాకు ఖాకీ వృత్తితో సంతృప్తినిచ్చిన ఇన్సిడెంట్.

ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్ ఉల్లం‘ఘనుల’పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సీఐ : నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను రోడ్ల మీదకు తీసుకొచ్చిన క్రమంలో వాటిని డిటెయిన్ చేస్తున్నాం. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే వాహనదారుల లైసెన్సులను సస్పెండ్ చేస్తున్నాం. రూల్స్‌ను బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ బస్సులు, వ్యానుల విషయంలో అత్యంత కఠినంగా ఉంటున్నాం. నిబంధనలు పాటించని వారిపై తగు చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ విషయంలో ఎట్టి పరిస్థితులలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా విధులు నిర్వహిస్తున్నాం. గ్రేటర్ వరంగల్ నగరవాసులు, ప్రజల సహకారంతోనే ఖాకీల విధులు మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. జనం సహకరించాలి. వారి సహకారంతోనే సొసైటీ మరింత ముందుకు వెళ్తుంది.