వేద న్యూస్, హైదరాబాద్/ వరంగల్:
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ ఆందోళనకు దిగారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు తమ నియోజకవర్గ జనసైనికుల ఆవేదనను చెప్పుకోవడానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా తనకు అవమానం జరిగిందని ఆరోపించారు. మిగతా ఇన్ చార్జిలను అనుమతించి తనను దాదాపు రెండు గంటలసేపు లోపలి రాకుండా బయటనే నిల్చోపెట్టి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు నేమూరి శంకర్ గౌడ్, రాధారపు రాజలింగం అవమానించారని పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా అడ్డుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తాను పార్టీ ఆఫీసు ముందు ఎదుట నిరసన తెలిపినట్లు స్పష్టం చేశారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నర్సంపేట నియోజవర్గంలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనలాంటి నాయకుడికి ఇలా జరగడం అత్యంత బాధాకరం అని వెల్లడించారు. ఈ చర్య జనసేన పార్టీని ఆదరిస్తున్న నర్సంపేట నియోజవర్గ ప్రజల నమ్మకాన్ని, సమిష్టి కృషితో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న జనసైనికులను అవమానించినట్టేనని చెప్పారు.

స్వయంకృషితో ప్రజల, జనసైనికుల ఆదరణను పొందుతూ బలమైన నాయకత్వంగా ఎదుగుతున్న తనను, ఆది నుంచి తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పార్టీలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు చెప్పకుండా తన గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. దాదాపు 15 రోజుల నుంచి నియోజకవర్గంలోని వాస్తవ పరిస్థితులను తన ఆవేదనను చెప్పుకున్నా తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు అసలు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఏదైనా విషయం అడిగితే తమకు ఏమీ తెలియదు..అంతా పవన్ కల్యాణే చూసుకుంటున్నారని దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.అందుకే తాను బుధవారం స్వయంగా పవన్ కల్యాణ్ ను కలవడానికి వెళ్లగా తనను అడ్డుకున్నారని చెప్పారు. జిల్లా నాయకులతో పార్టీకి ఆఫీస్‌కు వస్తే బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా నర్సంపేటకు జనసేన సీటును బీజేపీ అధిష్టానం కేటాయించడానికి వంద శాతం అవకాశం ఉన్నా ఎందుకు వద్దనుకుంటున్నారని అడిగారు.
కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న 5 స్థానాల్లో ఒక స్థానమైన అవకాశం కల్పించాలని కోరితే టాపిక్ డైవర్ట్ చేసి,. వరంగల్ జిల్లాలో గతంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేసి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, తమపై తప్పును బనాయించే విధంగా జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకత్వం పవన్ కల్యాణ్ కు వివరించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్..నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, సైనికుల ఆవేదనను అర్థం చేసుకోవాలని వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
