= అక్రమార్కులకు సింహస్వప్నం.. సామాన్యులకు అభయ హస్తం
= నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న పోలీస్ బాస్ స్టేట్ మెంట్స్
= తెలంగాణ ఖాకీల వైఖరిలో మార్పు..
= సరికొత్త శకానికి నాంది పలికిన డీజీపీ
= ఫ్రెండ్లీ పేరుతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతే ఉక్కుపాదమే
= ఆదిలాబాద్ పర్యటనలో స్ట్రైట్ వార్నింగ్
= సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు
= డబ్బు సంపాదించాలంటే పోలీస్ ఉద్యోగానికి రావొద్దు.. పాన్ షాప్ పెట్టుకోండి!
= ఇటీవల సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు
= డీజీపీ సర్.. పైరవీలకూ అడ్డకట్ట వేయాల్సింది మీరే..
వేద న్యూస్, (ఎల్.కే) ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ పోలీస్ శాఖలో ఒక సరికొత్త శకానికి నాంది పడబోతోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో నడుస్తున్న సంప్రదాయ పోలీసింగ్ పంథాకు పూర్తిగా భిన్నంగా, భవిష్యత్తులో ఖాకీల వైఖరి ఎలా ఉండబోతోందనే విషయాలపై నూతన డీజీపీ సీవీ ఆనంద్ తనదైన శైలిలో స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. గతంలో ఉన్న డీజీపీలు, పాలకులు సమాజానికి ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ ఒక కొత్త నినాదాన్ని పరిచయం చేశారు. అయితే, ఆ నినాదం క్షేత్రస్థాయికి వెళ్లేసరికి దాని అసలు ఉద్దేశం పక్కదారి పట్టిందనే విమర్శలు బలంగా వచ్చాయి. ‘ఫ్రెండ్లీ’ అనే ముసుగును ఆసరాగా చేసుకుని అసాంఘిక శక్తులు, నేరగాళ్లు రెచ్చిపోతుంటే.. పోలీసులు మాత్రం చేతులు కట్టేసుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందనే ఆవేదన డిపార్ట్‌మెంట్‌లో ఉండిపోయింది. దీనివల్ల కాలక్రమేణా పోలీసు శాఖలోనే కొంతమంది సిబ్బంది ఆత్మస్థైర్యం తీవ్రంగా దెబ్బతిన్నదనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ మాది స్ట్రాంగ్ పోలీసింగ్ అంటూ పలుమార్లు సంకేతాలిచ్చారు.

పోలీసింగ్‌కు సరికొత్త దారి..
ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్, పాత పంథాకు స్వస్తి పలుకుతూ ‘ఇక స్ట్రాంగ్ పోలీసింగే’ అంటూ కొత్త దారి చూపబోతున్నారు. చట్టాన్ని గౌరవించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో ప్రగతి ప్రణాళిక – ప్రజా పాలనలో భాగంగా వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన, విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇకపై కఠినమైన పోలీసింగ్ వ్యవస్థ ఉంటుందని తేల్చి చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నినాదం కేవలం చట్టాన్ని గౌరవించే సామాన్య ప్రజల కోసమేనని.. సమాజంలో అలజడులు సృష్టించే అసాంఘిక శక్తుల పట్ల అత్యంత కఠినంగా, సింహస్వప్నంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ‘ఏ’ అనే అక్షరంతో ప్రారంభం అవుతుందని, మేము కూడా ఇక్కడి నుంచే మా వ్యవస్థ పటిష్టం అయ్యేలా కార్యక్రమాలు చేపడుతామన్నారు.
డ్రగ్స్ మహమ్మారిపై సీరియస్
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి, గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోతుండటంపై కొత్త డీజీపీ అత్యంత సీరియస్‌గా ఉన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో గంజాయి ఎక్కువగా సాగవుతోందని, దీనిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న 252 ఎకరాల పరిధిలోని 110 మంది రైతులకు ప్రభుత్వ సాయమైన ‘రైతు భరోసా’ రాకుండా నిలిపివేశామని డీజీపీ సంచలన విషయం వెల్లడించారు. అసాంఘిక శక్తులకు ఎక్కడా, ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ ఉన్నా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే బలమైన మెసేజ్‌ను ఆయన అందించారు.
పోలీస్ అంటే అప్డేట్..
పోలీసులు అంటే ఎప్పటికప్పుడు సమాజంతో అప్డేట్ గా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని డీజీపీ నొక్కి వక్కాణిస్తున్నారు. ఇప్పుడు నేర స్వరూపమే పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ పోలీసులకు సైబర్ క్రైం పెద్ద టాస్క్‌గా మారిందని డీజీపీ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లపై అవగాహన కల్పిస్తున్నా అత్యాశ పడేవాళ్లు మోసపోతూనే ఉన్నారన్నారు. క్రైమ్ చేసే విధానంలో నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావడం పెద్ద సమస్యగా పరిణమించిందన్నారు. దానికి తగ్గట్టుగానే పోలీస్ వ్యవస్థసైతం అప్డేట్ గా ఉంటుందని చెప్పడంతో డీజీపీ ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో తన కింది సిబ్బందికి సందేశం ఇచ్చారు.
నిజాయితీపై ఘాటైన సందేశం
పోలీసు శాఖలోకి కొత్తగా వచ్చే యువతకు, ప్రస్తుత అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ విధుల్లో నిజాయితీపై అత్యంత ఘాటుగా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే తపన, నిబద్ధత ఉన్నవారే ఈ శాఖలోకి రావాలి. అంతేకానీ, అధికారం చెలాయించడానికో, అక్రమంగా డబ్బు సంపాదించడానికో వస్తే ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్‌లో పడటం, సస్పెండ్ కావడం ఖాయం అని స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు పోలీస్ ఉద్యోగానికి రావడం కంటే, ఒక పాన్ షాపు పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువే సంపాదించుకోవచ్చని, దయచేసి డిపార్ట్‌మెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి, శాఖకు చెడ్డపేరు తేవద్దని హితవు పలికారు. చార్జ్ తీసుకున్న అనతి కాలంలోనే తనదైన స్టైల్ స్టేట్‌మెంట్స్, నూతన టెక్నాలజీతో సీవీ ఆనంద్ తెస్తున్న ఈ మార్పులు అటు నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుండగా, ఇటు సామాన్య ప్రజల్లో భద్రతా భావాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
డీజీపీ సర్.. పైరవీలకు అడ్డుకట్ట వేయాల్సిందీ మీరే..
రాష్ట్రంలో స్ట్రాంగ్ పోలీసింగ్‌కు శ్రీకారం చుడుతున్న డీజీపీ సీవీ ఆనంద్ దృష్టి మరో కీలక అంశంపై కూడా పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో రాజకీయ, ఆర్థిక పైరవీలు పెరిగిపోవడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం ఆలస్యమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది స్థానిక నాయకుల ఒత్తిళ్లకులోనై అక్రమార్కులకు కొమ్ముకాస్తూ అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా తరచూ వెలుగుచూస్తున్నాయి. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీల వంటి అంశాల్లో చట్టబద్ధమైన విచారణ కంటే పైరవీలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని బాధితులు వాపోతున్నారు. స్టేషన్ స్థాయిలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారంలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, పోలీస్ స్టేషన్లను రాజకీయ మరియు వ్యక్తిగత ఒత్తిళ్ల నుంచి విముక్తం చేసి చట్టం ముందు అందరికీ సమాన న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, సామాజిక వర్గాలు డీజీపీని కోరుతున్నాయి.
