= వరంగల్లో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలు
= వందల కోట్ల ప్రభుత్వ భూములు, చెరువులు స్వాహా
= నాలాలు, దేవాలయ స్థలాలు కబ్జాదారుల కన్ను
= ‘కోట’ పరిసరాల్లో భారీగా అక్రమ వ్యాపార నిర్మాణాలు
= నగరంలోని నయిమ్ నగర్ నాలాపై భారీగా అక్రమ కట్టడాలు
= టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉక్కుపాదం మోపుతున్నా తగ్గని అక్రమార్కులు
= కేయూ భూముల రక్షణకు రూ.20 కోట్లతో ప్రహరీ..
= 25ఏళ్ల కల నెరవేరుస్తూ 10 కిలోమీటర్ల గోడ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ జిల్లాలో భూ మాఫియా అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, ఆఖరికి దేవాలయ స్థలాలు, చారిత్రక కట్టడాల పరిసరాలు సైతం అక్రమార్కుల పంపకాలకు వేదికగా మారుతున్నాయి. అడిగేవారు లేకపోవడంతో యథేచ్ఛగా అప్పనంగా ఆక్రమించుకుంటూ, రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలతో సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు. అక్రమ కబ్జాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం, స్థానిక అధికారులు రంగంలోకి దిగినా కబ్జాదారులు మాత్రం తమ పంథావీడడం లేదు. ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’ బృందాలను ఏర్పాటు చేసి, కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.. కొందరు కేటుగాళ్లు స్థానిక నాయకులు, అధికారుల అండతో రెచ్చిపోతున్నారు.
ఆక్రమణల చెరలో వరంగల్ ఖిల్లా
కాకతీయుల కాలం నాటి చారిత్రక వరంగల్ కోట సైతం అక్రమార్కుల చేతుల్లో నలిగిపోతోంది. కోట పరిసరాల్లోని చారిత్రక మట్టి ప్రాకారాలు, రాతి గోడల పరిసరాలను స్థానికులు ఆక్రమించి భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చారిత్రక సంపదను కనుమరుగు చేస్తున్న ఈ వ్యవహారంపై కేంద్ర పురావస్తు శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇటీవల ఈ ఆక్రమణలపై స్పందిస్తూ, తక్షణమే అక్రమ కట్టడాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖలు రాశారు. దీంతో అధికారులు ఖిల్లా పరిసరాల్లోని ఆక్రమణల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి చర్యలు తీసుకుంటున్నారు.
దేవాలయ భూములు, చెరువులు మాయం
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భగవంతుడి ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. భద్రకాళి, పద్మాక్షి, మెట్టుగుట్ట వంటి ప్రముఖ, చారిత్రక ఆలయాలకు చెందిన దాదాపు 1,400 ఎకరాల భూములు ఆక్రమణల పరిధిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం భూములే కాదు.. నగర పరిధిలోని 30కి పైగా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. నగరానికి వరద ముప్పు లేకుండా చూసే నయిమ్ నగర్ నాలా వంటి ప్రధాన నీటి ప్రవాహ ప్రాంతాలను సైతం మట్టితో పూడ్చేసి అక్రమంగా భవనాలు నిర్మించేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు కొన్నిచోట్ల ఈ అక్రమ కట్టడాలను కూల్చివేయగా.. మరికొన్ని చోట్ల కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కుంచించుకుపోతున్న కేయూ క్యాంపస్
అత్యంత విలువైన భూములుగా ఉన్న కేయూ ప్రాంగణంలో ఆక్రమణలు నిరంతరం పెరిగిపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 50 ఎకరాల కేయూ భూములు కబ్జాదారుల హస్తగతమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయంలో కబ్జాదారుల అరాచకాలు పెరిగిపోవడంతో, ఆస్తులను కాపాడటం పాలక మండలికి తలకు మించిన భారంగా మారింది. ఒకవైపు అక్రమ కబ్జాలు, ఇంకోవైపు కొన్ని సంస్థలకు భూమి కేటాయించడంతో ఏటి కేడు క్యాంపస్ భూములు కుంచించుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా రక్షణ గోడ నిర్మాణంతో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట పడటంతో పాటు విశ్వవిద్యాలయ ఆస్తుల పరిరక్షణకు బలమైన భరోసా లభించనుంది.
కేయూ చుట్టూ రక్షణ గోడ.. 25 ఏళ్ల కల సాకారం!
కబ్జాలకు నిలయంగా, అక్రమార్కులకు వరంగా మారిన కాకతీయ విశ్వవిద్యాలయం భూముల రక్షణకు ఎట్టకేలకు తెరలేచింది. రెండు దశాబ్దాలకు పైగా హామీలకే పరిమితమైన ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. గతంలో వీసీలుగా విధులు నిర్వహించిన వారందరూ ప్రహరీ నిర్మాణం తమ ప్రాధాన్యమని చెప్పినా, అవి ఆచరణకు నోచుకోలేదు. గత 2024లో కేయూ ఇన్‌ఛార్జి వీసీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ గోడ నిర్మాణంపై మొగ్గు చూపి, అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అది సాధ్యపడలేదు. అలా 25 ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రూ.వందల కోట్ల విలువైన కేయూ భూములను కాపాడేందుకు రూ.20 కోట్లతో 10 కిలోమీటర్ల మేర సుదీర్ఘ రక్షణ ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
