= ఈసారి ముక్కోణపు పోరు తప్పదా?
= పదేళ్ల తర్వాత గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
= రూ.5,257 కోట్ల ప్రాజెక్టే అస్త్రం
= పూర్వవైభవం కోసం గులాబీ పార్టీ మాస్టర్ ప్లాన్
= ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నిలదీత
= ట్రైసిటీ పట్టణ ఓటర్లపై బీజేపీ కన్ను
= కేంద్ర నిధులు, స్మార్ట్ సిటీయే ప్రధాన ఎజెండా
= స్థానిక సమస్యలు, ఉపాధిపైనే ఓటర్ల ప్రధాన తీర్పు.
= నగర డివిజన్లను 100కు పెంచేందుకు ముమ్మర కసరత్తు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా మూడు ప్రధానపార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటి నుంచే అత్యంత ప్రతిష్టాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మేయర్ పాలకవర్గం గడువు ముగిసి ప్రత్యేక అధికారి పాలన నడుస్తుండటంతో, రాబోయే గ్రేటర్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే గురిపెట్టాయి. గ్రేటర్ పీఠాన్ని ఎలాగైనా ఈసారి చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ.. తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్.. పట్టు పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు పక్షాలు వేర్వేరు వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నాయి.

హస్తం స్పీడ్.. ‘రూ.5 వేల కోట్ల’ అభివృద్ధి అస్త్రం!
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ట్రెండ్స్‌ను ఇక్కడా కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. పదేళ్ల తర్వాత గ్రేటర్ వరంగల్‌లో ఎలాగైనా హస్తం జెండా ఎగురవేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే, వరంగల్ నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించడమే లక్ష్యంగా ఏకంగా రూ. 5,257 కోట్లతో సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ భారీ నిధుల కేటాయింపును కాంగ్రెస్ తన ప్రధాన ఎన్నికల అస్త్రంగా వాడుకోనుంది. దీనికి తోడు ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలను, పలువురు కార్పొరేటర్లను చేర్చుకుంటూ క్షేత్రస్థాయి క్యాడర్‌ను బలపరుచుకుంటోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసికట్టుగా ఉండి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా అధిష్ఠానం పర్యవేక్షిస్తోంది.

పూర్వవైభవం కోసం గులాబీ పోరు..
గత మున్సిపల్ ఎన్నికలలో పూర్తి పట్టు సాధించిన బీఆర్ఎస్, ఇప్పుడు గ్రేటర్ వరంగల్‌లో తన ఉనికిని చాటుకోవడానికి, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికలలో ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో గులాబీ బాస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వరంగల్‌లో బలమైన పట్టున్న, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కీలక సీనియర్ నేతకు గ్రేటర్ ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య కార్పొరేటర్లు పార్టీ వీడినప్పటికీ, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని, క్షేత్రస్థాయి కార్యకర్తలను కాపాడుకోవడమే బీఆర్ఎస్ ముందున్న ప్రధాన సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలు, స్థానిక నిరుద్యోగ సమస్యలు, నగరంలో నిలిచిపోయిన పాత కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టుల ఆలస్యంపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగడుతున్నారు.

‘ట్రైసిటీ’పై కమలం కన్ను..
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్, హనుమకొండ పరిధిలో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకున్న బీజేపీ, ఈసారి కార్పొరేషన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది. సాధారణంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘ట్రైసిటీ’ (వరంగల్-హనుమకొండ-కాజీపేట) పరిధిలో ఉన్న విద్యావంతులు, వ్యాపార వర్గాల మద్దతు కూడగట్టడంపై కమలదళం ప్రత్యేక దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి, నగరంలో డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, ఇటీవల పెరిగిన నేరాలపై స్థానిక బీజేపీ నేతలు వరుసగా ఆందోళనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. స్మార్ట్ సిటీ మిషన్, అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన నిధులను, చేసిన పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఓట్లు అడుగుతున్నారు.

ప్రధాన సమస్యలు ఇవే..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని శాసించడంలో ఇక్కడి స్థానిక సమస్యలే అత్యంత కీలకమైన పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ప్రతి వర్షాకాలంలో ఓరుగల్లు నగరం వరద నీటితో మునిగిపోవడం ఇక్కడ పెద్ద సమస్యగా మారగా, దీనిపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికే అధికార కాంగ్రెస్ పార్టీ రూ. 5వేల కోట్ల పైచిలుకు డ్రైనేజ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది, ఇది ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మారనుంది. మరోవైపు, ఇటీవల నగరంలో డ్రగ్స్, గంజాయి ముఠాల అరెస్టులు పెరగడం, నేరాల శాతం ఎక్కువవడంపై ప్రతిపక్షాలు పోలీసు, ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రచారం చేస్తూ రాజకీయ మైలేజ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వీటికి తోడు, వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, ఐటీ టవర్లలో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన, పరిశ్రమల విస్తరణ వంటి ఉపాధి అంశాలు కూడా ఈ గ్రేటర్ పరిధిలోని ఓటర్లను భారీగా ప్రభావితం చేయనున్నాయి.

డివిజన్ల పెంపునకు కసరత్తు..
రాజకీయ పార్టీల వ్యూహాల కంటే ముందే వరంగల్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే ఒక భారీ మార్పుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్‌లో 66 డివిజన్లు ఉండగా, వాటిని ఏకంగా 100 డివిజన్లకు పెంచాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఒక్కో డివిజన్‌లో ఓటర్ల సంఖ్యను తగ్గించి, చిన్న డివిజన్లుగా మార్చడం ద్వారా ఓటరుకు పౌర సేవలు సులభతరం చేయాలనేది ఈ నగర పునర్విభజన ప్రధాన ప్లాన్ కాగా, దీనివల్ల స్థానిక రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకి రానున్నాయి. ఒకవేళ డివిజన్ల సంఖ్య 100కు పెరిగితే కార్పొరేటర్ టికెట్ల ఆశావహుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలలో అంతర్గత పోటీ తీవ్రమవడానికి, కొత్త పొలిటికల్ ట్రెండ్స్‌కు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *