• గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ దాడి 
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

వేద న్యూస్ గంగాధర:

గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద బిల్లు విడుదల చేయడానికి లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు.

ప్రత్యక్ష సమాచారం ప్రకారం, పంచాయతీ కార్యదర్శి అనిల్, మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తికి చెందిన ఇల్లు బిల్లు క్లియరెన్స్ కోసం రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్టు తెలిపారు.

బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు నివేదించగా, వారు పక్కా ప్రణాళికతో మధురానగర్ పంచాయతీ కార్యాలయంలో ట్రాప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి, లంచం మొత్తాన్ని, సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది. ప్రస్తుతం అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.