- మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక రోజు శిక్షణ
వేద న్యూస్, మేడ్చల్:
దేశాభివృద్ధిలో సైబర్, సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాలాన్ని అస్త్రంగా మార్చుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత పెరిగింది. 2023-24 సంవత్సరంలోనే సైబర్ నేరగాళ్లు దాదాపు రూ. 23 వేల కోట్ల మేర ప్రజల సొమ్మును దోచుకున్నట్లు సైబర్ నేరాల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సైబర్ నేరాల అవగాహన దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పిటిసి)లో “సైబర్ మేధ-ఏఐ-2025” అనే అంశంపై ఒక రోజు అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ శిక్షణకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన 652 మంది సభ్యులు హాజరయ్యారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, వాటిని ఎలా నిరోధించాలి, బాధితులను ఎలా రక్షించాలో శిక్షణలో తెలుసుకున్నారు. తాము నేర్చుకున్న ఈ అవగాహనను సమాజంలో అందరికీ తెలియజేస్తామని ఇంపాక్ట్ సభ్యులు తెలిపారు.
గోల్డెన్ అవర్స్ ఆవశ్యకత
‘గోల్డెన్ అవర్స్’ (బంగారు గంటలు)లో సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు ఫోను చేసి ఎలా ఫిర్యాదు చేయాలో ట్రైనర్‌లు అనుభవపూర్వకంగా వివరించారు. పరిచయం లేని వ్యక్తులకు వ్యక్తిగత డేటా, ఓటీపీలు, మొబైల్స్, కంప్యూటర్లు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ప్రయోగాత్మకంగా, ఆన్‌లైన్ లింకులతో సహా ఉదాహరణలిచ్చారు.
“డిజిటల్ అరెస్ట్” పేరిట భారత్‌లో ఎలాంటి అరెస్టులు ఉండబోవని, సైబర్ నేరగాళ్లు డేటాను తస్కరించి అతి తెలివితో చేసే మైండ్ గేమ్ మాత్రమే అని, ఇలా కోట్లల్లో డబ్బులు కొట్టేస్తున్నారని హెచ్చరించారు.
దక్షిణ భారతదేశంలోనే సైబర్ నేరాల బాధితులు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత రక్షణ కోసం తరచుగా పాస్‌వర్డ్‌లు మారుస్తుండాలని నిపుణులు హితవు పలికారు.
ఉన్నతాధికారుల కృషితో.. నిపుణుల భాగస్వామ్యం
పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, మేడ్చల్, ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లయన్ గంప నాగేశ్వర్ రావు, ప్రముఖ సైబర్ నేరాల అవగాహన నిపుణులు ప్రవీణ్ అర్జున్, పోలీస్ ట్రైనర్ ఉపాధ్యాయులు నిఖిల్ లు వివిధ రకాల సైబర్ నేరాలు జరిగే పద్ధతులు, వాటి నివారణ, నిర్వీర్యం చేసే విధానాలపై శిక్షణ ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంకుల అధికారులు సైతం బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు ఎలా వెళ్తాయో మెలకువలపై అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల అవగాహనను ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మధుకర్ స్వామి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందిస్తూ, ఇంపాక్ట్ ట్రైనర్లు తమ చుట్టూ ఉన్న సమాజంలో సైబర్ నేరాల అవగాహన కల్పించే బాధ్యతను ముందుండి నిర్వహిస్తామని తెలిపారు.
ఈ శిక్షణలో పాల్గొన్న ఇంపాక్ట్ ట్రైనర్లకు, ఇతర ట్రైనీలకు ఉన్నత పోలీసు అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లతో పాటు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం, 2026 తిరుమల తిరుపతి దేవస్థాన డైరీని బహుమానంగా అందజేశారు.
సహభాగస్వామ్యంలో భాగంగా ఈ కార్యక్రమంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మేడ్చల్, ఇంపాక్ట్ ట్రైనింగ్ సంస్థ, లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ, టి-షీల్డ్ మరియు స్కిల్ వేద అనే సంస్థలు పాలుపంచుకున్నాయి.


