•  కాలుష్య కారణాలుగా మారుతున్న ఫెస్టివల్స్
  •  భారతీయ పండుగల్లో పాశ్చాత్య వింత దోరణులు
  •  సాంఘిక స్థాయిని చూపించుకునేలా చేంజెస్..
  •  మూఢ నమ్మకాల ముసుగులో ఇంకా జీవ బలిపీఠాలు

పండుగలు అంటే మనుషుల మధ్య ఆనందాన్ని, స్నేహాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, ఆప్యాయతను, మనుషుల, ప్రకృతి-పంచాభూతాల మధ్య, మానవ ఆవాస పర్యావరణ ఆరోగ్యాన్ని బాగుండేలా స్థిరంగా ఉంచే సందర్భోచిత వేడుక రోజులు.

అందరూ కలిసి మెలిసి, ఆనందోత్సాహలతో జరుపుకునే ఈ ఫెస్టివల్స్ రోజున చిన్నా-పెద్దా, విభిన్న జాతులు, భిన్న మతాలు, కులాలు ఒకరికొకరు వేరైనా కలిసి జరుపుకుంటారు. ప్రతీ పండుగకు భారతదేశంలో ఒక నిర్దిష్టమైన కారణమూ, సందర్భముగా, పురాణము, ఇతిహాసము ఆనవాయితీ ఉన్నదని మన పూర్వీకులు చెబుతుంటారు.

పర్యావరణహితంగానే పండుగలు ఉండాలి..

పండుగ వల్ల పర్యావరణానికి హాని జరగకూడదు. కానీ మన దేశ పండుగలు జరుపుకునే విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. పండుగలను జరుపుకునే క్రమంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు రోజురోజుకూ మారిపోతున్నాయి.

ఫెస్టివల్స్‌ను సెలెబ్రేట్ చేసుకునే సందర్భాల్లో వ్యక్తిగత సామర్థ్యం చూపించుకోవటం, సాంఘిక స్థాయి ప్రదర్శన, సంతోష అనుభవం కోసం మరీ విపరీత దొరణలను ఎంచుకుంటున్నారు.

ఆ విపరీతమైన కారణ రీతులలో ఆర్థిక, సామాజిక, శరీరక, మానసిక, ఆరోగ్య పర్యావరణ, సహజ విపత్తుల సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకోవాల్సిన పండగలు వాటి పంథాలను మార్చుకుంటున్నాయి. పండగలు ఒక్కొక్కసారి పోటీ పడి జరుగుతున్నాయి. ఆ మార్పు అనేక చెడు దారులకు చేరువ చేస్తున్నాయి.

భారతీయ పండుగలపై పాశ్చాత్య ప్రభావం
అభివృద్ధి, మారుతున్నకాలం, శాస్త్ర-సాంకేతికత ప్రభావం, ప్రపంచీకరణ, వలసల కారణంగా ఈ దేశంలోకి అనేక రూపాల్లో పాశ్చాత్య సంసృతి విస్తరిస్తోంది. భాష, కట్టు, బొట్టు, సంగీతం, సాహిత్యం, అంతర్జాలం, మొబైల్, సాంఘిక మధ్యమాలు, భావప్రకటన, సమాచార మార్పిడి, సంభాషణ మొదలైన బాటలలో నుండి దీని ప్రభావం దేశంపైన ప్రజలపైన ఎంతో చూపుతోంది.

పండుగ సెలెబ్రేషన్లలో, గుడులల్లో, బడులల్లో, విగ్రహాల ముందు డీజేలు, ఆటలు, ద్వందార్ధపు మాటలు, పాటలు, నృత్యాలు, రంగుల కాంతులు క్రాకర్స్ కాల్చటం, మద్యం వినియోగం, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసలు విజ్రుంభన ప్రభావం రోజురోజుకూ విఫరీత ధోరనులతో చెలరేగిపోతోంది. దీని ప్రభావం సమాజంపైన, ప్రకృతి, పర్యావరణం, సహజవనరులపైన పడుతూ కాలుష్య భారం పెరుగుతూ వాతావరణ మార్పులు, అనారోగ్యం, అతివృష్టి, అనవృష్టి, అనారోగ్యం, కొత్తరోగాల విజృంభణ, శుద్ధ ఆహార, శుద్ధ నీటి, శుభ్రమైన గాలి లోపాలకు గురిచేస్తుంది.

పర్యావరణ కాలుష్యం
పండుగల పేరుచేప్పుకుని సహజ వనరుల (భూమి కాలుష్యం, వాయుకాలుష్యం, జలకాలుష్యం, ధ్వని కాలుష్యం, ఆహారం కాలుష్యం మొ.) ధ్వంసం, విష రసాయణాల వాడుక, టపాకాయల కాల్పులు భూమిని వనరులను కలుషితం చేస్తూ హానిచేకూరుస్తున్నారు. సంవత్సరలైన పర్యావరణంలో కలిసి నశించలేని రసాయన పదార్థాలు (పీవోపి), కాన్సర్ కారక రసాయన, ఘన, ద్రవ, వాయు పదార్ధాల వాడుక కొనసాగుతోంది.

ఎవరి ప్రయోజనం కోసం మారుతున్న పండుగలు?
ఎవరి ప్రయోజనం కోసం పండుగలు జరుపుకునే పంథాను మార్చుకుంటున్నాయి? ఆర్థికలావాదేవీలు ఎవరిమధ్య?, లాభాలు ఎవరికీ? వాతావరణ మార్పులు, మానసిక రుగ్మతలు, శరీరక, ఆర్థిక నష్టాలు ఎవరికీ? వీటిని క్రమపరచడంలో ఎవరికీ డబ్బు చేరుతోంది.

కాలుష్యం (భూ, వాయు, జల శబ్ద కాలుష్యం) ఎవరికీ? అసలు బాధ్యులెవరు, బాధితులెవరు? ఈ విపరీత ధోరణులతో పండుగలను జరుపుకుంటూ.. రోజు రోజుకూ మనకు మనమే మృత్యు గొయ్యిలు తీసుకుంటున్నాం.

ఆధిపత్య ధోరణిలో అన్ని పండుగలలోనూ మూఢ నమ్మకాలను ప్రోత్సాహిస్తూ జంతు బలులు, మాస పంపకాలు, విపరీతమైన మూఢ నమ్మకాలను అడ్డుట్టుకొని పూజలు, కొలుపులు, సామూహిక పండుగలు, జాతరలు, పేరుతో పక్షులను, జంతువులను, వాడుకోవడం, హింసించడం, విధేశి ఉత్పత్తుల వినియోగం (బానసంఛ, గ్లాసు మంజా దారం, రంగులు) చెట్లను నరకడం మొదలగు అసమతుల్య పర్యావరణ పరిస్థితులను ఏర్పరచి, భౌమ్యావరణంలో జీవవైవిధ్యానికి నష్టం వాటింపచేస్తున్నారు.

భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పండుగలను మద్యం మత్తులో ఊరేగుతూ పైశాచికత్వరూపల్లో ముఖ్యంగా యువతను పక్కదారులు పట్టిస్తున్నారు.

*ప్రతీ మనిషిలో మార్పు అవసరం*
పర్యావరణ రక్షణ కోణంలో వ్యక్తిగతంగా అందరిలో మార్పు రావాలి తప్ప పర్యావరణ, జీవశాస్త్ర శాస్త్రవేత్తల హెచ్చరింపులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో మార్పు పూర్తిగా తేలేక పోతున్నాం. మనిషి చేస్తున్న పర్యావరణ అకృత్యాలలో పండుగల కాలుష్య ఉత్పన్నాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సహజ ఉత్పత్తులైన పసుపు, కుంకుమ, మోదుగ పువ్వు, మైదాకు, సుద్ద, గట్టిపిండి మొ. రంగులతో ఒకరికొకరు రాసుకుని పూసుకునే హోలీ పండుగను బలమైన, భయంకరమైన కృత్రిమ భారమైన లోహ రసాయన ఉత్పత్తుల (ఘన, ద్రవ రూపంలో)ను, కోడిగ్రుడ్లను, వాడుకును ఉపయోగించిన నల్లని గ్రీజ్ కలిసి కలుషితమైన ఆయిల్‌తో, చివరకు పశువుల మలంతో కూడా రాసుకుంటున్నారు, పూసుకుంటున్నారు. ఇది జుగుప్సకరమే కాదు..ఈ చర్యలవల్ల చర్మరోగాలు, హృద్రోగాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాన్సర్ జంతు సంక్రమణ (జూనోటిక్) హానికారక రోగాలు వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జీవ బలి పీఠాలు
పండుగలొస్తున్నాయంటేనే మూఢనమ్మకాల ముసుగును అడ్డుపెట్టుకొని.. బక్రీద్ పండుగ రోజున పశువుల వధతో మాంసమును పంచుతున్నారు. కబేలాల దగ్గర వధిస్తున్న జంతు రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. ధర్గా, ఊరుసు క్షేత్రాలలో ప్రతిరోజు కందూరు పండుగ పేరుతో జంతువులను కోసి పేగులు అర్పితున్నారు.

దసరా రోజున జంతు బలి, సామూహిక గ్రామ దుర్గమ్మ పండుగలు, పెద్దమ్మ పండుగలు, పోచమ్మలు, కట్ట మైసమ్మలు, ఉప్పలమ్మ మారెమ్మలు, గ్రామదేవతల సామూహిక పండుగల్లో గుడుల వద్ద జరుపుతున్నారు. రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. కొన్ని పండుగల్లో ఆచారంలో భాగమని పశువులను ఆటల్లో ఉపయోగించి పైశాచిక ఆనందం, జూదంగా జల్లికట్టు ఆట, కోళ్ల పందాలు బెట్టింగులు లాంటి ఆటలను, వాటి సందర్బంగా పండుగలు న్యాయస్థానాలు నిషేదాజ్ఞలు జారిచేసిన బేఖాతారు చేస్తూ నిర్వహిస్తున్నారు.

ప్రమాదాలు
పండగలనేవి మన ఇంటికి ఆనంద భోగభాగ్యలు తెచ్చే సంతోష దినాలు కావాలి. కానీ, సంక్రాంతి రోజున ఎగురవేసే పతంగుల తాడు ఇప్పుడు చైనా గాజు మాంజాతో తయారు చేయగా దిగుమతి చేసుకొని మరీ పతంగులను ఎగురావేస్తున్నారు. దీని వల్ల అకాశంలో ఎగిరే విహంగాలకు మంజా తట్టి రెక్కలు తెగి అవి నెలరాలుతున్నాయి.

ద్విచక్రవాహనదారులకు తగిలి మెడ, శరీరభాగాలు కోసుకుని తెగి, ప్రమాదలకు గురవుతున్నారు.

ఏ కొత్త సంవత్సరం, బోనాల పండుగ, బతుకమ్మపండుగ, దసరా, దీపావళి, నోములు, సంక్రాంతి, పుట్టినరోజులు, పెళ్లిరోజు, గెలుపు పండుగలు మొదలగు సందర్భాలు ఏవైనా భయంకరమైన పేలుళ్ల శబ్దాలతో బాణాసంచా కాల్పులు సమయపాలనను లెక్క చేయకుండా ఆనవాయితీగా మారిపోయాయి. 500 ఏండ్లయినా నీటిలో, భూమిలో కలువని, కరిగిపోని ప్లాస్టర్ అఫ్ పారీస్ పదార్ధాన్ని, విషపురిత రంగులను ఎలాంటి రక్షణాకేకుండా నీటిలో పడేస్తున్నారు. పర్యావరణ హిత రక్షణచట్టాలను పూర్తిస్థాయిలో అమలు పరిచి కట్టడి చేయాలి. అప్పుడు కొంతవరకైనాభయంతో పర్యావరణంమై రక్షణ ఉంటుంది.

భూమిపై అన్ని జీవులకు జీవించే హక్కు

ఈ భూమండలం అన్ని జీవులది. ఒక్క మానవులే కాదు అన్ని జీవులు భౌమ్యావరణాన్ని సమానంగా పంచుకుని జీవించే హక్కును ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి గీసిన నియమ గీత దాటి వెళితే భౌమ్యావరణంలో అనేకరూపాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రభావం వలన భూమి వేడెక్కడం, ఓజోన్ క్షయం, భూమి కోతకు (భూ క్షయం) గురి కావడం, అన్ని ఆవాసాలు సమాతుల్యత కోల్పోవడం, దీని పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు (ప్రకృతివిపత్తులు) అయినా అతివృష్టి, ఆనావృష్టి, తుపానులు, వరదలు, నీటి ముంపులు, మంచు, ఇసుక తుపనులు, వడగండ్లు, వడగాలులు, మంచుకరిగి సముద్ర మట్టాలా పెరుగుదలతో సముద్ర తీరా ప్రాంత పట్టణాల మునక, కార్చిచ్చులు (అటవీ మంటలు), పచ్చదనం (హరితం) కోల్పోవడం, కొత్తగా పుట్టుకొస్తున్న అంటువ్యాధులు (ఎమర్జింగ్ డీసీజెస్), పర్యవసానాలను ఎన్నో మనం చూస్తున్నాం.

ఇవికాకుండా మానవ కృత్రిమ చేష్టల (ఆంథ్రపోజెనిక్ ఆక్టివిటీస్) వల్ల అతి సృష్టి కొత్త వల్ల వైరస్‌లు, బాక్టీరియాల వలన ఎన్నోరోగాలు వచ్చి అనారోగ్యం, చావులు ఆర్థిక నష్టం జరుగుతున్నది. భారత రాజ్యాంగం అధికారణ 51, ఏ/జి ప్రకారం చుట్టువున్న అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం మరియు జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం గా భావించి మన భారతీయ పండుగలను పూర్వపు పద్ధతులలో పర్యావరణ హితంగా బాధ్యతగా జరుపుకొని జీవ మనుగడకు తోడ్పడాలి.

పర్యావరణ రక్షణ దిశలో కృత్రిమ జీవన మార్గాలకు స్వస్తి చెబుతూ వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరిలో మార్పు రావాలి.అప్పుడే పండుగలు పృథ్వీ పునీతాలౌతాయి. పర్యావరణహిత జీవనం-ఆనంద జీవన సుగమ మార్గం అవుతుంది.

రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, జేఎన్టీయూహెచ్, సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, తెలంగాణ.