వేద న్యూస్, జమ్మికుంట:
నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు ఉద్దేశ్యం న్యుమోనియా అనే ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, సమయానికి గుర్తించి సరైన చికిత్స చేయించుకోవడం. కాగా, ఇప్పుడు న్యుమోనియా నివారణకు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రజలకు అవగాహన నిమిత్తం ప్రముఖ వైద్యుడు, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ పలు సూచనలు చేశారు. చిన్నారులు, వృద్ధుల ఉసురును ఈ వ్యాధి తీసుకుంటుందని చెప్పారు.
నివారణ చర్యలు
పిల్లలు టీకాలు తప్పక వేయించుకోవాలని, న్యుమోకొకాల్ వ్యాక్సిన్, ఇన్‌ఫ్లుయెంజ వ్యాక్సిన్ పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. ఇవి న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు.
శుభ్రత పాటించాలని, చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవడం, దగ్గు, తుమ్ము సమయంలో నోరు, ముక్కు కప్పుకోవడం, గదులలో విశాలంగా గాలి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.
 
పొగ తాగడం మానేయాలని స్పష్టం చేశారు. ధూమపానం ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తుందని వివరించారు. 
పోషకాహారం తీసుకోవాలన్నారు. విటమిన్ ఏ, సీ, డీ, జింక్ కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తగినంత నీరు తాగాలని వెల్లడించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, సీవోపీడీ లేదా మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని స్పష్టం చేశారు. 
న్యుమోనియా లక్షణాలు ఇవే..
అధిక జ్వరం, దగ్గు (కఫంతో లేదా లేకుండా), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి,చిన్నపిల్లల్లో వేగంగా శ్వాస, ఆహారం తినకపోవడం.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ సురేశ్ చెప్పారు. “న్యుమోనియా నివారించగలిగిన, చికిత్స చేయగలిగిన వ్యాధి అని, అవగాహన, టీకాలు, పరిశుభ్రత మన రక్షణ కవచాలు.”  అని స్పష్టం చేశారు.