వేద న్యూస్ కేయూ క్యాంపస్:

విశ్వవిద్యాలయ కాంపస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక ఇండక్షన్ ప్రోగ్రాం ఎక్స్ ఫ్లోర్, ఎంగేజ్, ఎక్సెల్ కార్యక్రమ గోడపత్రికను గురువారం సాయంత్రం కేయూ కమిటీ హాల్‌లో జరిగిన విభాగాధిపతుల సమావేశంలో, వైస్‌ ఛాన్స్‌లర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, విభాగాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం డిసెంబర్ 12న శుక్రవారం ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో విసి విభాగాధిపతులతో ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అకాడమిక్ ప్రమాణాలను అభివృద్ధి చేసే దిశగా అధ్యాపకులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టైమ్‌టేబుల్ ప్రకారం తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని, ఈ అకాడమిక్ ఇయర్ లో 1150 మంది విద్యార్థులు యూనివర్సిటీ కాలేజీలోని వివిధ పి.జి. కోర్స లలోప్రవేశాలు పొందినట్టు, తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఎంత తక్కువగా ఉన్నా క్లాసులు కొనసాగాలని పేర్కొన్నారు. విభాగాల రిసెర్చ్ వర్క్ పురోగతిని నిరంతరం సమీక్షించాలని సూచించారు. విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. 2028 న్యాక్ గ్రేడింగ్ దృష్ట్యా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. టీచింగ్ డైరీలు, అకాడమిక్ రిపోర్టులు, హాజరు సంబంధిత వివరాలను నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. విభాగాధిపతులు, ప్రిన్సిపాల్ లు మూడు నెలలకు ఒకసారి ఐక్యూఎసి కి అకాడమిక్, రీసెర్చ్, కో కర్రికులర్ ఆక్టివిటీస్ పురోగతి పై విభాగ రిపోర్టులను పంపాలని చెప్పారు. ఎన్ఈపి ప్రమాణాలకు అనుగుణంగా పీజీ సిలబస్ పునర్‌వ్యవస్థీకరణ పై డీన్ లు ఇప్పటికే పని చేస్తున్నారని, ఒక కామన్ టెంప్లెట్ ను ఆధారంగా పి.జి. సిలబస్ మార్పు పై విభాగాల అధిపతులు, పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు సిద్దంగా ఉండాలన్నారు. అకాడమిక్ కమిటీలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, విభాగాలు కూడా దానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. విధుల్లో అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని స్పష్టంచేశారు. ప్రతి నెలా విభాగాల పురోగతిని సంబంధిత పోర్టల్ లో అప్‌లోడ్ చేసి రిపోర్ట్ చేయాలని, విద్యార్థులు తరగతులకు హాజరు కావడానికి విభాగాధిపతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. విశ్వవిద్యాలయంలో అకాడమిక్, రీసెర్చ్ పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వైస్‌ ఛాన్స్‌లర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.