వేద న్యూస్, కాసిపేట:
మంచిర్యాల జిల్లా దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు లంబాడీతండా (డి) గ్రామ శివారులో గుడుంబా స్థావరాలపై ఎస్ఐ గంగారాం సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్థానిక సమాచారంతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న గుడుంబా తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి, అక్కడ ఉన్న 1,500 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీ పరికరాలు, డ్రములు తదితర సామగ్రిని ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్న వారికి ఇకపై ఉపశమనం ఉండబోదని ఎస్ఐ గంగారాం స్పష్టం చేశారు. తనిఖీల అనంతరం గ్రామస్థులతో మాట్లాడిన ఎస్ఐ గంగారాం, గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారీలో పాల్గొన్నా, అమ్మినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు కూడా అక్రమ మద్యాన్ని నిర్మూలించడంలో భాగస్వాములై గ్రామాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. దేవాపూర్ పోలీసుల చర్యలతో గ్రామ ప్రజల్లో అవగాహన పెంపొందడంతో పాటు అక్రమ కార్యకలాపాలపై భయం నెలకొంది.