= సీపీఐ జిల్లా నాయకులు డిమాండ్
వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ పట్టణంలోని బోయవాడ 58వ డివిజన్‌కు చెందిన నిరుపేద మహిళ లైన్ మంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి ప్రహరీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు కూల్చివేసిన ప్రహరీ గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధుల అండదండలతో మున్సిపల్ అధికారులు ప్రహరీ గోడను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న మహిళకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి గోడను కూల్చివేయడం అన్యాయమన్నారు. నగరంలో పేదవారికి ఒక న్యాయం, ధనికులకు మరో న్యాయం జరుగుతోందని ఆరోపించారు. పేద కుటుంబం తమ స్థలాన్ని అమ్మకుండా ఇల్లు నిర్మించుకోవడమే కారణంగా ఈ చర్య జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే పేదల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బాధితురాలు లైన్ మంగా, లైన్ మల్లేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.